హాట్‌.. హాట్‌..! | Sakshi
Sakshi News home page

హాట్‌.. హాట్‌..!

Published Wed, Mar 8 2017 10:39 PM

హాట్‌.. హాట్‌..! - Sakshi

వెలగపూడిలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. రాష్ట్రంలో మూడేళ్లుగా నెలకొన్న సమస్యలపై వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలతో అధికార పార్టీ నేతలకు కాక పుట్టించారు. బీ.కాంలో ఫిజిక్స్‌.. రాష్ట్ర వృద్ధి రేటు గురించి ప్రభుత్వ లెక్కలపై వైఎస్‌ జగన్‌ వేసిన సెటైర్లు నవ్వులు పూయించాయి. అసెంబ్లీ లోపల ఆయన ప్రశ్నలతో సమావేశాలు వాడీవేడిగా సాగగా... బయట భానుడిభగభగలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.

సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడిలో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం రెండవరోజుకు చేరుకున్నాయి. ఈ సమావేశాలకు అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఇద్దరు, ముగ్గురు మినహా దాదాపు అందరూ హాజరయ్యారు. తొలిసారిగా వెలగపూడిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనం రెండవ రోజు తగ్గారు. అయినా అసెంబ్లీలో ఏం జరుగుతుందోననే విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు.

జగన్‌ ప్రసంగంపై విస్తృత చర్చ
ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై ప్రశ్నల వర్షం కురింపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోవడంపై మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రంలో వృద్ధి రేటు గురించి ప్రభుత్వ తప్పుడు లెక్కలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేయడం చర్చనీయాంశమైంది. వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తుండగా పదేపదే మైక్‌ కట్‌ చేయడంతో జనం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అధికారపార్టీ నేతలు కొందరు పనిగట్టుకుని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు. ఈ సమావేశానికి టీడీపీ నేతలు అనుకూల మీడియా, పత్రికా విలేకరులను మాత్రమే పిలిచి గొప్పలు చెప్పుకోవడం కనిపించింది. అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై ‘బీ.కాంలో ఫిజిక్స్‌ చదివిన వారికి ఆ లెక్కలు అర్థం కావులే అధ్యక్షా..’ అని అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ వేసిన సెటైర్‌ లోపల, విజయవాడ, గుంటూరు నగరాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.

పోలీసుల హడావుడి...
బందోబస్తు పేరుతో పోలీసులు హడావుడి చేశారు. అసెంబ్లీ కార్యదర్శి సంతకంతో ఇచ్చిన పాసులు చూపించినప్పటికీ లోపలికి పంపలేదు. గుర్తింపు కార్డును కూడా చూపించాలంటూ పట్టుబట్టారు. ఇలా అసెంబ్లీ ముందు ఏర్పాటు చేసిన ఐదు అంచల భద్రతను దాటుకుంటూ వెళ్లే సరికి జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందిపడాల్సి వచ్చింది.

ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి
మరోవైపు ఎండ తీవ్రతకు అసెంబ్లీ బయట ఉన్న పోలీసులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి మంచినీరు అందకపోవడం, నీడ కోసం అధికారులు, జనం పరుగులు తీశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మంచినీరు లేకపోవడంతో బయట నుంచి కొందరు బాటిల్స్‌ తీసుకెళ్లి ఇవ్వడం కనిపించింది. మొత్తంగా రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు లోపల, వెలుపల వాడివేడిగా సాగటం గమనార్హం.

Advertisement
Advertisement