తిండికి తిప్పలు | Sakshi
Sakshi News home page

తిండికి తిప్పలు

Published Tue, May 30 2017 11:41 PM

తిండికి తిప్పలు - Sakshi

- జీఎస్టీకి వ్యతిరేకంగా మూతపడిన హోటళ్లు
- ఇబ్బందులు పడ్డ జనం


అనంతపురం కల్చరల్‌ :  జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా హోటళ్ల నిర్వాహకులు మంగళవారం నిరసన తెలిపారు. సౌత్‌ ఇండియా హోటల్స్‌ అసోసియేషన్‌ పిలుపుమేరకు రెస్టారెంట్లు, డాబాలు, హోటళ్లు, వాటికి అనుబంధంగా ఉన్న లాడ్జీలు దాదాపు 80 వేల వరకు మూతపడ్డాయి. జీఎస్టీ విధానం అమలులోకి వస్తే తాము తీవ్రంగా నష్టపోతాయని, ఇతర రాష్ట్రాలలోని పన్ను విధానం మంచిది కాదని పలువురు హోటల్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. జిల్లా హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంజీ రాజు నేతృత్వంలో నగరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. విపరీతంగా పెంచిన పన్ను విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ (గూడ్స్‌ సర్వీస్‌ టాక్స్‌) ప్రకారం జూలై 1 నుండి అమలయ్యే పన్ను విధానం వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.

దీని ప్రభావం కస్టమర్లపైనే ఎక్కువగా ఉంటుందనీ,  సామాన్యుల నడ్డి విరిచే ఇటువంటి విధానాన్ని మార్చాలని డిమాండ్‌ చేశారు. న్యాయంగా పెరిగితే సమర్థించడానికి సిద్ధంగా ఉన్నామని కానీ ఏకంగా స్టార్‌ హోటల్స్, ఏసీ రెస్టారెంట్లపై 16 శాతం వరకు  పన్ను పెంచడం దారుణమన్నారు. తమిళనాడులో 2 శాతం, కర్నాటకలో 4 శాతం, కేరళలో 0.5 శాతం పన్ను రేటుంటే ఏపీలో ఒక్కసారిగా ఇంత స్థాయిలో పెంచడం సబబు కాదనీ, పాలకులు దీనిని పట్టించుకోకుంటే రానున్న రోజుల్లో నిరవధిక బంద్‌కు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో హోటల్‌ అసోసియేషన్‌ సభ్యులు రుద్రప్ప, రమణ, రఘురామ్, మోహన్, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement