ఇంటి నిర్మాణం బహుభారం

15 Oct, 2016 22:50 IST|Sakshi
ఇంటి నిర్మాణం బహుభారం

పెరిగిన సిమెంటు, ఐరన్‌ ధరలు
బెంబేలెత్తిపోతున్న నిర్మాణదారులు
కలగా మారిన సామాన్యుల సొంతిల్లు


భవన నిర్మాణంలో కీలక భూమిక పోషించే సిమెంటు, ఇనుము (ఐరన్‌) ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల కలగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయి. ధర తక్కువగా ఉన్నపుడు నిర్మాణాలు చేపట్టిన వారు తాజా పరిణామంతో కంగుతిన్నారు. ఉత్పత్తి తక్కువ.. డిమాండ్‌ ఎక్కువ కావడంతో సిమెంటు, ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడంతో ఐరన్‌ ధరలను ఆయా కంపెనీలు పెంచేశాయి.

రోజురోజుకూ పెరుగుతున్న ఇనుము, సిమెంట్, ఇతర వస్తువుల ధరలు ఇల్లు నిర్మించాలనుకునే వారిని బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కనిష్ట స్థాయికి పడిపోయిన ఐరన్‌ ధరలు మళ్లీ పుంజుకున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే టన్ను ఐరన్‌ ధర రూ. 5వేల దాకా పెరిగింది. గతంలో టన్ను ఇనుము ధర రూ. 34 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 38 వేలకు పెరిగింది. మరికొన్ని ప్రముఖ బ్రాండ్ల ఇనుము టన్ను రూ.40 వేల దాకా విక్రయిస్తున్నారు.

నెల రోజుల్లోనే సిమెంటు ధర పైపైకి..
నెలరోజుల వ్యవధిలో సిమెంటు బస్తాపై దాదాపు రూ.80 నుంచి రూ.100 దాకా పెరిగింది. పెరిగిన ధరతో బస్తా రూ. 280 నుంచి రూ.360కి చేరింది. పెరిగిన సిమెంట్‌ ధరల కారణంగా ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా ఈ సీజన్‌లో సిమెంట్‌ ధరలు స్థిరంగా ఉండొచ్చని గహæనిర్మాణదారులు భావించారు. మార్కెట్‌ వర్గాలు సైతం ఊహించని విధంగా సిమెంట్‌ ధరలు ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యుడు రెండు గదుల ఇళ్లు నిర్మిచుకునే పరిస్థితి కూడాలేకుండా పోయింది. ఇంటి నిర్మాణాలు ఆగిపోతే తమ బతుకులు ఎలాగని, పూట ఎలా గడుస్తుందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారం తగ్గింది
గత నెలలో రోజుకు సుమారుగా 100 మూటల సిమెంట్‌ అమ్మేవాళ్లం. కానీ ఈ నెలలో సిమెంట్‌ ధర విపరీతంగా పెరిగిపోవడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం అతి కష్టం మీద 30 నుంచి 40 మూటల సిమెంట్‌ అమ్మగలుగుతున్నాం. ధరలు తగ్గితేగాని గిరాకీలు వచ్చేపరిస్థితి లేదు.
– నారాయణ, సిమెంట్‌ వ్యాపారి

ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు
సిమెంట్, ఇనుము ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇనుము, సిమెంట్‌ ధరలు పెంచడమే కానీ తగ్గించేది లేదు. అప్పులు చేసి అయినా సొంత ఇంటిని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే మధ్యలో ఇలా ధరలు పెరగడంతో ఆ అప్పు మరింత ఎక్కువవుతోంది.
– రామాంజనేయులు, భవన యజమాని

మరిన్ని వార్తలు