జన్‌ధన్ ఖాతాల్లో భారీగా నగదు జమ | Sakshi
Sakshi News home page

జన్‌ధన్ ఖాతాల్లో భారీగా నగదు జమ

Published Tue, Nov 29 2016 1:40 AM

జన్‌ధన్ ఖాతాల్లో భారీగా నగదు జమ

నోట్ల రద్దు అనంతరం దాదాపు రూ.150 కోట్లు డిపాజిట్?
గ్రామీణులకు ఎరవేస్తున్న నేతలు, వ్యాపారస్తులు
ఖాతాలపై ఆర్‌బీఐ, ఆదాయపు పన్నుశాఖ దృష్టి

 
తిరుపతి క్రైం:  జన్‌ధన్ ఖాతాలకు భారీగా డబ్బులు జమవుతున్నాయి. మొన్నటి వరకు ఇన్ యాక్టివ్‌లో ఉన్న అకౌంట్లు ఇప్పుడు యాక్టివేషన్‌లోకి వచ్చాయి. 500 రూపాయలు కూడా లేని చాలా ఖాతాల్లో ఇప్పుడు వేలు, లక్షలు వచ్చి పడుతున్నాయి! కేంద్ర ప్రభుత్వంరూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేసిన అనంతరం డబ్బులు వచ్చిపడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 19 రోజుల వ్యవధిలోని జిల్లాలోని జన్‌ధన్ ఖాతాలలో దాదాపు 150 కోట్ల రూపాయల పైచిలుకు డిపాజిట్ అయినట్లు సమాచారం. దీంతో ఆ ఖాతాలపై ఆదాయపు పన్నుశాఖ, రిజర్వ్ బ్యాంక్  దృష్టి సారించినట్లు సమాచారం.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ఏడాది క్రితం జిల్లాలో 6 లక్షలకు పైగా జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించారు. గతనెల వరకు ఈఖాతాలు నిర్వహించిన వారు 5శాతం వరకు కూడా లేరు. అరుుతే నోట్ల రద్దు అనంతరం జన్‌ధన్ ఖాతాలను వినియోగించడం గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో సైతం పెత్తందారులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, పేదల జన్‌ధన్ ఖాతాల వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఖాతాల్లోకి భారీగా డబ్బు వచ్చిపడుతోందని ఆర్‌బీఐ భావిస్తోంది.

బ్యాంకుల వారీగా జన్‌ధన్ ఖాతాల్లో వస్తున్న డిపాజిట్లపై విచారణకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అనధికార సమాచారం వరకు జిల్లాలో సుమారు రూ.150 కోట్లకు పైగా డిపాజిట్ అయినట్లు తెలిసింది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో డిపాజిట్లు చేరితే ఆదాయం పెరిగిందనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీలు కట్ చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం లేదని తెలుస్తోంది. ఈ డబ్బులు ఖాతాదారులవేనా? ఇతరులు వేస్తున్నారా? అనే కోణంలో ఆర్‌బీఐ అధికారులు, ఆదాయపు పన్నుశాఖ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం.

గ్రామీణులకు ఎర
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు బడాబాబులు, బడానేతలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు గ్రామనేతలు స్థానికులను పిలిపించుకుని ‘ఒక ఇంటికి లక్ష, రెండు లక్షలు ఇస్తాం..మీ ఖాతాల్లో మేము డబ్బులు వేస్తాం..వాటిని ఏడాది తరువాత మాకు ఇవ్వండి. . ఎలాంటి వడ్డీ అవసరం లేదు’ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో వాడుకల్లో లేని పేదల ఖాతాలకు డిమాండ్ వచ్చింది. జిల్లాలో 45 లక్షలకు పైగా ఎస్‌బీఐ ఖాతాలు ఉన్నారుు. వీటిల్లోనూ డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయని తెలిసింది.
 
కమీషన్ల జోరు
బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చడంలో కమీషన్ల దందా పెద్ద ఎత్తున సాగుతోంది. 10 లక్షలు రద్దయిన కరెన్సీ ఇస్తే 6 లక్షల నుంచి 7.50 లక్షల వరకు కరెన్సీ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. జిల్లాలోని కొన్ని బ్యాంకుల్లో భారీగా కొత్త కరెన్సీ దారి మరలించడం వల్లే బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతోందనే విమర్శలొస్తున్నాయి. అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement