Sakshi News home page

జయశ్రీ హౌస్‌ అరెస్ట్‌

Published Tue, Jan 10 2017 11:04 PM

Human Rights Leader Jayasree House Arrest

 – సీఎం పర్యటన దృష్ట్యా గృహంలో నిర్బంధించిన పోలీసులు
ప్రొద్దుటూరు క్రైం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గండికోట పర్యటన దృష్ట్యా మంగళవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీని పోలీసులు ఆమె గృహంలో నిర్భందించారు. త్రీ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణంరాజు నాయక్‌ రాత్రి 9.45 సమయంలో శాస్త్రి నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లి హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లను ఆమె ఇంట్లో ఉంచారు. 11న సీఎం చంద్రబాబునాయుడు పైడిపాళెం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా జయశ్రీని పోలీసులు ఆమె గృహంలో బంధించారు. గత కొన్ని రోజుల నుంచి గండికోట ముంపు వాసులకు పరిహారం కోసం జయశ్రీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇళ్లను ఖాళీ చేయకుండా గండికోట రిజర్వాయర్‌ నుంచి నీళ్లు వదలడంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలు ఇళ్లలో ఉండగానే నీరు వదలడం పట్ల నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో జయశ్రీ నేతృత్వంలో చౌటపల్లె గ్రామస్తులు నీళ్లలో జలదీక్షకు పూనుకున్నారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం గండికోట ముంపు నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించింది.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా
ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా అని జయశ్రీ అన్నారు. ఎందుకు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారో రాత మూలకంగా తెలియచేయకుండా ఒక న్యాయవాది హక్కులను కాలరాస్తున్న పోలీసులు, సామాన్యుల పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంటుందని అన్నారు. ప్రశ్నించడమనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, మరి ప్రశ్నించడాన్ని కూడా ప్రభుత్వం సహించకుంటే ఎలా అని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే ఎస్పీ.. నోటి మాటగా ప్రతి సారీ నా ఇంట్లో పోలీసులను పెట్టడం ఏంటని అన్నారు.  ఇన్ని వేల మంది పోలీçసులు ఉన్న సభలో సీఎం చంద్రబాబును  ప్రశ్నించడం తప్ప ఏం చేయలేం కదా అన్నారు. ప్రతి సారి నా స్వేచ్ఛను హరించడం ఏంటని జయశ్రీ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నించడం నేరం అనుకుంటే ఎలా అని అని, చట్టపరంగా ముంపు గ్రామాలకు డబ్బు ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాం తప్ప మరొకటి కాదని తెలిపారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుకు తీసుకొని వెళ్తే నగదు లేదని, నాలుగు రోజుల తర్వాత ఇస్తామని చెబుతున్నారని అన్నారు. డబ్బు లేనపుడు చెక్కులు ఎందుకు ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే ఇలా హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని జయశ్రీ అన్నారు.
 

Advertisement
Advertisement