పోలీసులపైనే మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు | Sakshi
Sakshi News home page

పోలీసులపైనే మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు

Published Sun, Aug 21 2016 2:19 AM

పోలీసులపైనే మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు - Sakshi

 పెనుగొండ : వ్యవస్థను కాపాడడానికి ఆయుథాలు కలిగి ఉన్న పోలీసులు, సైన్యం  పైనే మానవ హక్కుల ఉల్లంఘన  ఆరోపణలు అధికంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌ అన్నారు. శనివారం పెనుగొండ ఎస్వీకేపీ అండ్‌ డాక్టర్‌ కేఎస్‌ రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నిర్వహించిన ‘మానవ హక్కుల విద్య’ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవహక్కుల ఉల్లంఘనలు వ్యకిగతంగానా? లేదా సమాజహితం కోసమా? అన్న అంశాలు ఇటువంటి జాతీయ సదస్సుల్లో పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని తరమికొట్టడానికి, సమాజహితం కోసం అప్పటి డీజీపీ కేపీఎస్‌ గిల్‌ కఠినంగా వ్యవహరించారన్నారు. దీనిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. మానవ హక్కుల పరిరక్షణలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిల వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.  
మనిషిగా జీవించనివ్వడమే మానవహక్కులు : హరగోపాల్‌
సమాజంలో మనిషిని మనిషిగా జీవించనివ్వడమే మానవ హక్కులని ఏపీ పౌరహక్కుల వేదిక సభ్యులు, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు. 1948లో ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్‌తో మానవ హక్కులపై చర్చ ప్రారంభమైందన్నారు. 72 సంవత్సరాలుగా 100 డాక్యుమెంట్లు, రెండు అంతర్జాతీయ సదస్సులు మానవహక్కులపై జరిగాయన్నారు. భారత రాజ్యాంగమే మానవ హక్కుల పరిరక్షణకు ఓ తార్కాణమన్నారు. పేద, బడుగుల మానవహక్కులను హైకోర్టు, సుప్రీంకోర్టు పరిరక్షిస్తున్నాయన్నారు. 
అవగాహన అవసరం
మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ ముందుగా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.సుబ్రహ్యణ్యం అన్నారు. నిత్యం 70 నుంచి 90 వరకు మానవహక్కుల ఉల్లంఘనలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటిలో చాలావరకు అవగాహన లేకుండా వస్తున్నాయన్నారు. సమావేశంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య ఎం. ముత్యాలనాయుడు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ నరసింహరాజు, సెక్రటరీ కరస్పాండెంట్‌ డాక్టర్‌ కె.రామచంద్రరాజు, పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి పెన్మెత్స వెంకట సుబ్రహ్యణ్యం, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, పిల్లి పుల్లంశెట్టి, కోట్ల వెంకటేశ్వరరావు, సూర్నిడి కోటేశ్వరరావు పాల్గొన్నారు. 
 

 

Advertisement
Advertisement