హంద్రీనీవాకు విస్తరణ యోగం | Sakshi
Sakshi News home page

హంద్రీనీవాకు విస్తరణ యోగం

Published Mon, Sep 12 2016 9:26 PM

హంద్రీనీవాకు విస్తరణ యోగం

 – రూ.850 కోట్లతో ప్రతిపాదనలకు రంగం సిద్ధం  
– 35 నుంచి 50 అడుగుల వరకు ప్రధానకాల్వ విస్తరణ
– నేడో, రేపో సీఈకి అంచనాలు


కర్నూలు సిటీ:
రాయలసీమ పరిధిలో కరువు నివారణే ధ్యేయంగా కష్ణా జలాలు తెచ్చేందుకోసం నిర్మించిన హంద్రీనీవా కాల్వకు విస్తరణ యోగం పట్టింది. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం వరకు హంద్రీనీవా నీరు వెళ్లాలంటే కాల్వ విస్తరణ తప్పనిసరి కావడంతో ఆ మేరకు ప్రభుత్వం చర ్యలు మొదలెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన కాల్వను 35 అడుగుల నుంచి 50 అడుగుల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం ఇంజినీర్లు రూ.850 కోట్లతో అంచనాలు సిద్ధం చేస్తున్నారు.  ప్రధాన కాల్వకు లైనింగ్‌తో 3,850 క్యుసెక్కుల సరఫరాకు డిజైన్‌ చేశారు. కానీ లైనింగ్‌ లేకుండా ఉండడం వల్ల 2 వేల క్యుస్కెక్కులు కూడా వెళ్లని పరిస్థితి ఏర్పడింది. ఈ మాత్రం సరఫరాకే కాల్వకు అక్కడక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఫేజ్‌–2 కింద చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీరు వెళ్లాలంటే కాల్వకు లైనింగ్‌ చేయాలని మొదట ప్రభుత్వం భావించింది. అయితే అనంతరం కాల్వపై పర్యటించిన జల వనరుల శాఖ నిపుణుల కమిటీ లైనింగ్‌ కంటే కాల్వ విస్తరణకే మొగ్గింది. ఏ మేరకు విస్తరించాలనే విషయంపై ఇటీవలే మంత్రి దేవినేని, ఉన్నతాధికారులు, నిపుణుల కమిటీ కాల్వపై పర్యటించి తగిన ఆదేశాలు ఇవ్వడంతో హంద్రీనీవా ఇంజినీర్లు సర్వే చేశారు. ఈ ప్రకారం తయారు చేసిన ప్రాథమిక అంచనాలను నేడో, రేపో హంద్రీనీవా సీఈకి, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.
 వైఎస్సార్‌ హయాంలోనే శ్రీకారం..
దశాబ్దాలుగా కోస్తా పెత్తందారుల చేతిలో దగా పడ్డ రాయలసీమకు కష్ణా జలాలు పారించి బంగారు పంటలు పండించాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2005లో హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చూట్టారు. చంద్రబాబు 1996 మార్చి 11న, 1999 జూలై 9న రెండు సార్లు శంకుస్థాపక చే సినా పనులు మొదలెట్టలేదు. ఈ ప్రాజెక్టును ఫేజ్‌–1. ఫేజ్‌–2గా చేపట్టారు. 565 కి.మీ. మేర 3,850 క్యుసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాల్వను డిజైన్‌ చేశారు. శ్రీశైలం వెనుకటి జలాల నుంచి 40 టీఎంసీల నీటిని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 6.0.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 33 లక్షల మంది దాహార్తి తీర్చేందుకోసం సుమారు రూ. 6850 కోట్లతో ప్రాజెక్టు చేపట్టారు. మొదటి ఫేజ్‌ కింద కర్నూలు, అనంతపుం జిల్లాల్లో 1,98,800 ఎకరాల ఆయకట్టు, ఫేజ్‌–2 కింద 4,04,500 ఎకరాల ఆయకట్టు ఉంది. డిజైన్‌ చేసిన ప్రకారం కాల్వలో నీరు పారితేనే చిత్తూరు జిల్లాకు వెళ్తుంది. అయితే కాల్వకు లైనింగ్‌ లేకపోవడంతో ఆ మేరకు నీరు వెళ్లడం లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో  ప్రధాన కాల్వ వెడల్పును 35 నుంచి 50 అడుగులకు(లోతు: 16 అడుగులు) పెంచేందుకు ప్రతిపాదిస్తున్నారు.

సీఎం ఆదేశాల మేరకు అంచనాలు
– నారాయణ స్వామి, హంద్రీనీవా ఇంచార్జీ ఎస్‌ఈ
హంద్రీనీవా కాలువను 3,850 క్యుసెక్కుల సామర్థ్యంతో డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఆ స్థాయిలో నీరు వెళ్లడం లేదు. మల్యాల ఎత్తిపోతలకు సంబంధించి 12 పంపుల ద్వారా పంపింగ్‌ చేస్తే వచ్చే నీటి సామర్థ్యం మేరకు కాల్వను విస్తరించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అంచనాలు తయారు చేస్తున్నాం. రెండు రోజుల్లో సీఈకి తుది అంచనాలు పంపుతాం.
 

Advertisement
Advertisement