కేన్సరని తెలిసినా కరుణించలేదు | Sakshi
Sakshi News home page

కేన్సరని తెలిసినా కరుణించలేదు

Published Mon, Aug 1 2016 10:52 PM

కేన్సరని తెలిసినా కరుణించలేదు

 
  • వ్యాధితో బాధపడుతూ బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ శైలకుమారి
  • పోస్టింగ్‌ ఇవ్వలేదని డీవీఈఓ కార్యాలయం ముందు నిరాహార దీక్ష
నెల్లూరు(టౌన్‌) : ఆరోగ్యం బాగాలేదని తనను నెల్లూరుకు బదిలీ చేయాలని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ నుంచి తీసుకువచ్చినా పోస్టింగ్‌ ఇవ్వకపోవడతో  ఆర్డర్‌ను పక్కనబెట్టడంతో మహిళా కాంట్రాక్టు లెక్చరర్‌ సోమవారం డీవీఈఓ కార్యాలయం ఎదుట నిరహార దీక్షకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన కందగడ్డల శైలకుమారి 2011 నుంచి కందుకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హిందీ కాంట్రాక్టు అధ్యాపకురాలుగా పనిచేస్తుంది. అప్పటి నుంచి ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రతినెలా నెల్లూరు క్యాన్సర్‌ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తనను నెల్లూరుకు బదిలీ చేయాలంటూ గతనెల 16వ తేదీన ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సత్యనారాయణను కలిసింది. విచారించిన ఆయన హెల్త్‌ గ్రౌండ్‌ కింద 28న వెంకటాచలం జూనియర్‌ కళాశాలకు బదిలీ చేస్తూ ఇచ్చారు. రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో బదిలీ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే ఆమె బదిలీకి అడ్డంకిగా మారింది. 
మరో అధ్యాపకురాలికి వెంకటాచలంలో పోస్టింగ్‌..
వెంకటాచలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హిందీ విభాగంలో రెగ్యులర్‌ అధ్యాపకురాలిని జూన్‌లో జరిగిన బదిలీల్లో నెల్లూరు డీకేడబ్ల్యూలో పోస్టింగ్‌ ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకులకు బదిలీల కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంతో వెంకటాచలంలో విద్యార్థులు నష్టపోతారనే కారణంగా డీకేడబ్ల్యూలో కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న విజయలక్ష్మీని తాత్కాలికంగా వెంకటాచలం కళాశాలకు బదిలీచేశారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న శైలకుమారికి వెంకటాచలంలో పోస్టింగ్‌ లేదని ఆర్జేడీ పరంధామయ్య చెబుతున్నారు. రెగ్యులర్‌ అధ్యాపకురాలి బదిలీతో డిస్ట్రబెన్స్‌ ఏర్పడిందని విజయలక్ష్మికి వెంకటాచలంలో పోస్టింగ్‌ ఇచ్చామంటున్నారు. కేవలం డబ్బులకు అమ్ముడుపోయి ఇలా చేశారని, ఆర్‌జేడీ తన బదిలీకి అడ్డు పడుతురని నిరాహారదీక్షకు దిగినట్లు శైలకుమారి చెబుతోంది.
కమిషనర్‌ ఆదేశాలు ప్రకారం పోస్టింగ్‌ కల్పిస్తాం : పరంధామయ్య, ఆర్‌జేడీ
శైలకుమారి ఆర్డర్‌ విషయంలో కమిషనర్‌కు విన్నవిస్తాం. ప్రస్తుతం వెంకటాచలంలో పోస్టింగ్‌ ఖాళీగా లేదు. కమిషనర్‌ ఆదేశాలు ప్రకారం నిర్ణయం తీసుకుని అమలుచేస్తాం, ఈనెల 8న కాంట్రాక్టు అధ్యాపకులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. ఈ కౌన్సెలింగ్‌లో వచ్చిన ప్రకారం పోస్టింగ్‌ ఇస్తామని చెప్పాం.

Advertisement
Advertisement