భార్యను కడతేర్చిన భర్త | Sakshi
Sakshi News home page

భార్యను కడతేర్చిన భర్త

Published Wed, Oct 12 2016 11:29 PM

husband murdered his wife in nalladasara palli

– అందరూ చూస్తుండగానే భార్యను ఈడ్చుకొచ్చాడు
– కసితీరా కొట్టి, ఆపై కత్తితో పొడిచి హతమార్చాడు
– రెండు నెలల కిందట ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
– పోలీసుల తీరుపై హతురాలి తల్లి ఆగ్రహం
––––––––––––––––––––––––––––––––––––––––
గుంతకల్లు రూరల్‌ : గుంతకల్లు రూరల్‌ మండలం నల్లదాసరపల్లికి చెందిన కృష్ణమూర్తి తన భార్య సావిత్రి(30)ను మంగళవారం అర్ధరాత్రి అత్యంత దారుణంగా హతమార్చాడు. హతురాలి తల్లి, బంధువులు, పోలీసుల కథనం ప్రకారం... నల్లదాసరపల్లికి చెందిన లక్ష్మిదేవి, అంజనయ్య దంపతుల కుమార్తె సావిత్రి వివాహం అదే గ్రామానికి చెందిన భాగ్యమ్మ, నరసింహులు దంపతుల కుమారుడు కష్ణమూర్తితో 13 ఏళ్ల కిందట అయింది. వారికి ఏడు, నాలుగేళ్ల వయస్సు కలిగిన ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

అనుమానం పెనుభూతమై...
సావిత్రిపై అనుమానం పెంచుకున్న కష్ణమూర్తి తరచూ ఆమెతో గొడవపడేవాడు. రెండు నెలల కిందట తీవ్రంగా కొట్టిగాయపరచడంతో అప్పట్లో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీస్‌ స్టేషన్‌లో పంచాయితీ అనంతరం భర్తకు దూరంగా తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి వరకు  గ్రామంలో జరిగిన మొహర్రం కార్యక్రమాల్లో పాల్గొన్న కష్ణమూర్తి అర్ధరాత్రి దాటాక పుట్టింట్లో నిద్రపోతున్న సావిత్రిని వీధిలోకి ఈడ్చుకొచ్చి, చితగ్గొట్టాడు. అంతటితో అతని కసి తీరలేదు. గొంతు నులిమి దాడి చేశాడు.

చుట్టుపక్కల వారి జోక్యంతో...
ఇరుగుపొరుగు వారి జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను అందరూ వెళ్లిపోయాక, మరోమారు సావిత్రి ఇంటికి చేరుకున్నాడు. మళ్లీ ఆమెను వీధిలోకి లాక్కొచ్చాడు. గొడవతో జనమంతా మళ్లీ పోగయ్యారు. ఎంతగా విడిపించాలని ప్రయత్నించినా ఈసారి అతను వదల్లేదు. అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో సావిత్రి మెడ, వీపు, ఎద భాగాలపై సుమారు 20 కత్తిపోట్లు పొడచి హతమార్చాడు.  విపరీతమైన రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

రంగంలోకి పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన ఎలా జరిగిందని ఆరా తీశారు. అనంతరం మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
రెండు నెలలుగా తమ బిడ్డను అల్లుడు కష్ణమూర్తి మానసికంగా, శారీరకంగా వేధించడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని సావిత్రి తల్లి లక్ష్మిదేవి ఆరోపించారు. అప్పట్లోనే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉన్నట్లైతే ఈరోజు తమ బిడ్డ అన్యాయంగా బలైపోయేది కాదని కన్నీటిపర్యంతమయ్యారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement