ప్రియుడే యముడు.. | Sakshi
Sakshi News home page

ప్రియుడే యముడు..

Published Thu, Aug 31 2017 2:56 AM

ప్రియుడే యముడు..

కోలమూరులో యువతి హత్య కేసును శోధించిన పోలీసులు
ప్రధాన నిందితుడు రాజస్థాన్‌ వాసి ∙ఆర్థికపరమైన ఇబ్బందులే కారణం


రాజానగరం : ప్రేమ పేరుతో ఆ యువతీయువకులు దగ్గరయ్యారు. సహజీవనం చేస్తున్నారు. అయితే ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా ఆ యువకుడు యువతిని హత్యచేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని బావిలో పడేసి తప్పించుకుందామనుకున్నాడు. పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. రాజానగరం పోలీసు స్టేషన్‌ పరిధి కోలమూరులో జరిగిన ఈ సంఘటనలో అరెస్టయిన ముద్దాయిల వివరాలను బుధవారం రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి స్థానిక పోలీసు స్టేషన్‌ వద్ద విలేకర్లకు వెల్లడించారు.


సిద్ధాంతిలా వచ్చి..
రాజస్థాన్‌కి చెందిన 29 ఏళ్ల యువకుడు మూడేళ్ల క్రితం సిద్ధాంతి మాదిరిగా తయారై కోలమూరు వచ్చాడు. అక్కడ చుండ్రు సత్యనారాయణ దంపతులతో పరిచయం పెంచుకుని, వారికి అబ్బాయిలు లేకపోవడంతో వారికి కొడుకుగా మారి, వారి ఇంటి పేరు, అడ్రసుతో ఆధార్‌ కార్డును పొందాడు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకుగా భావించిన ఆ దంపతులు అతడు చెప్పిన విక్రమాదిత్య పేరును నమ్మి ముద్దుగా ఆదిత్య అని పిలుచుకుంటున్నారు. సిద్ధాంతి వేషాన్ని తీసేసి స్థానికంగా దొరికే చిల్లరమల్లర పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న ఆదిత్య రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రంపచోడవరానికి చెందిన పళ్లాల పద్మ(25)కు చేసిన రాంగ్‌ కాల్‌తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అది క్రమేపీ ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల క్రితం కోలమూరులోనే ఒక ఇల్లు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆమె ఆరు నెలల క్రితం ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది.  

ఆర్థికపరమైన తగాదాతో చంపేశాడు
సహజీవనం సాగిస్తున్న ఆదిత్య, పద్మల మధ్య తరచూ ఆర్థికపరమైన సమస్యలు వస్తుండేవి. ఈ క్రమంలో పద్మ అభద్రతాభానికిలోనై పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చేది. దీంతో ఆమె తన చెప్పుచేతల్లో ఉండడం లేదని భావించిన ఆదిత్య ఈనెల 10న అదే ప్రాంతంలోని బొమ్మన కాలనీకి ఆమెతో సహా మరో ఇంటికి మకాం మార్చాడు. అయినా వారి మధ్య ఆర్థికపరమైన గొడవలు తొలగిపోలేదు. ఈనెల 16వ తేదీ సాయంత్రం కూడా అదేవిధంగా గొడవ పడిన సమయంలో ఆదిత్య కోపంతో పద్మను కొట్టడం, ఆమె సృహ తప్పిపడిపోవడం, వెంటనే ఆమె మెడలో ఉన్న చున్నీని తీసి, గొంతుకు బిగించాడు. చనిపోయిందని గ్రహించి, తన తండ్రిగా ఉన్న చుండ్రు సత్యనారాయణ సహయంతో ఆ మృతదేహాన్ని ఒక గోనె సంచెలో కట్టి, బొమ్మన కాలనీలోని పోతురాజు బావిలో విరిగిపోయిన సిమెంటు దిమ్మలు కట్టి పడేశాడు.

ఐదు రోజులకు (ఈనెల 21) ఆ సంచె పైకి తేలడంతోపాటు దుర్వాసన రావడంతో వీఆర్వో నిర్మలకుమారి ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, బావిలో సంచిలో కట్టి పడవేసిన యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. గుర్తు తెలియని యువతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో పరారీలో ఉన్న నిందితులు ఆదిత్య, సత్యనారాయణలను బుధవారం అరెస్టు చేసి, కోర్టు హాజరుపరిచామని అర్బన్‌ జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

ఆదిత్య పుట్టపూర్వోత్తరాలపై ఆరా..
ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న విక్రమాదిత్య రాజస్థాన్‌ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు, చుండ్రు సత్యనారాయణ దంపతులను తల్లిదండ్రులుగా చెప్పుకుంటూ వారి అబ్బాయిగానే ఆధార్‌ కార్డుతోపాటు ఇతర సదుపాయాలు పొందడంలో ఉన్న మతలబుపై ఆరా తీస్తున్నామని అర్బన్‌ జిల్లా ఎస్పీ తెలిపారు. రాజస్థాన్‌కు తమ సిబ్బందిని పంపిస్తామన్నారు. ఈ కేసును శోధించి, నిందితులను పట్టుకోవడంలో అత్యంత చురుకుగా వ్యవహరించిన  డీఎస్సీ కె.రమేష్‌బాబు, సీఐ వరప్రసాద్, రాజానగరం పోలీసులను ఆమె అభినందించారు.

Advertisement
Advertisement