సీఎంతో నాకెలాంటి విభేదాల్లేవ్ | Sakshi
Sakshi News home page

సీఎంతో నాకెలాంటి విభేదాల్లేవ్

Published Mon, Mar 21 2016 2:41 AM

సీఎంతో నాకెలాంటి విభేదాల్లేవ్ - Sakshi

టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
 
 రాయికల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలంగాణ రాజకీయ జేఏసీ(టీజేఏసీ) చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో కరువు పరిస్థితులను పరి శీలించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతుంటే... ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు. తమ ఇద్దరిదీ ఒకే దారి అని పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, తాను జేఏసీ తో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం చేశామని గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, కోదండరాం మధ్య భేదాభిప్రాయాలున్నాయని చాలా మంది అంటున్నారని, అది కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. తమ ఇద్దరిదీ ఒకే పంథా అని అన్నారు. జేఏసీలోంచి వివిధ సంఘాలు వారి ఇష్టానుసారంగానే బయటకు వెళ్తున్నాయని తెలిపారు. త్వరలోనే జేఏసీ ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం తనకు రాజకీయా ల్లో ప్రవేశించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అన్నా హజారే వంటి నాయకులు సేవ చేస్తున్నారే తప్ప రాజకీయాల్లోకి వస్తున్నారా? అని అన్నారు. కరువు పరిస్థితులపై అధ్యయనం చేసి రైతులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement