Sakshi News home page

నన్ను కిడ్నాప్‌ చేశారు

Published Sun, Oct 2 2016 12:42 AM

నన్ను కిడ్నాప్‌ చేశారు

పుల్లంపేట: రంగంపల్లి ఎంపీటీసీ సభ్యురాలినైన తనను టీడీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథనాయుడు, ఆ పార్టీ పుల్లంపేట మండల ఇన్‌చార్జి కిష్టయ్యనాయుడు కిడ్నాప్‌ చేసి వేధింపులకు గురిచేశారని గాడి సుబ్బనరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడికి విషయాన్ని తెలిపింది. తాను అమెరికాలో తన కుమారుని వద్ద ఉండగా ఆ నాయకులు ఇద్దరూ కలిసి తనకు ఎంపీపీ పదవి ఇప్పిస్తామని, ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు తాను చెన్నై విమానాశ్రయంలో దిగగానే వారు కారులో ఎక్కించుకుని, రెండు రోజుల పాటు కిడ్నాప్‌ చేశారని పేర్కొంది. తనను తిరుపతిలో బంధించి, సెప్టెంబర్‌ 29న ఎంపీపీ ఎన్నికలకు వెళ్లనీయకుండా చేశారని వాపోయింది. ఈ సమావేశానికి కూడా తనను రానీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారని తెలిపింది. వారి నుంచి ప్రాణాపాయం ఉందని రోదించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అందుకు ఆయన వెంటనే స్పందించి మీకు జరిగిన అన్యాయాన్ని రాత పూర్వకంగా రాసి ఎంపీడీవోకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆ నివేదికను కలెక్టర్‌కు పంపుతామని ఆయన హామీ ఇవ్వడంతో సభాముఖంగా ఆమె ఫిర్యాదు అందించారు. అనంతరం సభ సజావుగా సాగింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు గైర్హాజరు అయ్యారు.
పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి:
పుల్లంపేటలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎంపీపీ బాబుల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రామనాథం, సుదర్శన్‌రెడ్డి ఎన్నికల అధికారి సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపత్రాన్ని వారు అధికారికి అందజేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విప్‌ జారీ చేయగా.. విప్‌ ధిక్కరించి కొత్తపేట ఎంపీటీసీ సుబ్బరాయుడు, దళాయిపల్లి ఎంపీటీసీ బోదనపు వహీదా పార్టీకి వ్యతిరేకంగా.. టీడీపీ ఎంపీపీ అభ్యర్థి రజనికి ఓటు వేశారని తెలిపారు. రంగంపల్లి ఎంపీటీసీ గాడి సుబ్బనరసమ్మ వైఎస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తగిన సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement