‘ఉపాధి’లో జిల్లాను అగ్రగామిగా చేస్తాం | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో జిల్లాను అగ్రగామిగా చేస్తాం

Published Wed, Jul 20 2016 9:48 PM

‘ఉపాధి’లో జిల్లాను అగ్రగామిగా చేస్తాం - Sakshi


– ఎన్టీఆర్‌ జలసిరి, పంటసంజీవని అమలులో ప్రథమ స్థానం
– సాక్షి ఇంటర్వ్యూలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ కె. రమేష్‌


 
కడప కార్పొరేషన్‌:
 జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె. రమేష్‌ తెలిపారు. డ్వామా పీడీగా ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయన  ఉపాధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పంట సంజీవని, ఎన్టీఆర్‌ జలసిరి పథకాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చిన ఆయన   ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు
.
ప్రశ్న: గత ఏడాది పథకం అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది కదా, ఈ ఏడాది
దాన్ని ఎలా రీచ్‌ కావాలనుకొంటున్నారు?

జవాబు: ఈ విషయంలో కొంత ఒత్తిడి ఉందిగానీ, అది సమష్టి కృషి వల్లే సాధ్యమైందని నేను భావిస్తున్నాను. ఉపాధి హామీ పథకాన్ని విస్తృత పరిచేందుకు జిల్లాలో అనేక వనరులు, అందుకు తగిన సిబ్బంది ఉన్నారు. అన్నింటినీ సద్వినియోగం చేసుకొని ముందుకు పోతాం.
ప్రశ్న: జాబ్‌ కార్డులకు ఆధార్‌ లింకేజీ కార్యక్రమం ఎంత వరకు వచ్చింది?
జవాబు: జాబ్‌కార్డులకు ఆధార్‌ లింకేజీ 83 శాతం పూర్తయింది. వంద శాతం ఆధార్‌ సీడింగ్‌
చేయుటకు ప్రయత్నిస్తున్నాము.
ప్రశ్న: ఈ ఏడాది ఇప్పటివరకూ ఎంతమందికి వందరోజులు పనికల్పించారు. దీనివల్ల ఎన్ని
కుటుంబాలు లబ్ధిపొందాయి?

జవాబు: ఈ మూడు నెలల కాలంలో 6149 మందికి వందరోజులు పనికల్పించాము. ఒక్కో
కుటుంబానికి సగటున 60.99 పనిదినాలు కల్పించాము.
ప్రశ్న: ఉపాధి హామీ పథకం కింద ఎన్ని ఎకరాల్లో పండ్లతోటలు పెంచుతున్నారు, ఎంత ఖర్చు
చేశారు?

జవాబు: 45వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకూ 25వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి అనుమతులు ఇచ్చాము. 16,794 ఎకరాల్లో పండ్లతోటలు పనులు జరుగుతున్నాయి. 1170 ఎకరాల్లో పూర్తయింది.
ప్రశ్న: పంట సంజీవని పథకం కింద ఎన్ని సేద్యపు నీటి కుంటలు తవ్వుతున్నారు?
జవాబు: జిల్లాలో 40వేల సేద్యపు నీటి కుంటలు తవ్వాలని టార్గెట్‌ ఇచ్చారు. అయితే లక్ష్యానికి మించి 66845 సేద్యపు నీటి కుంటల తవ్వకానికి అనుమతులు ఇచ్చాము. 1735 కుంటలు వివిధ దశల్లో ఉండగా, 9వేల కుంటలు పూర్తయ్యాయి.
 ప్రశ్న: చంద్రన్న బాట ద్వారా ఎన్ని కిలోమీటర్లు సీసీరోడ్లు నిర్మిస్తున్నారు?
జవాబు: చంద్రన్నబాట పథకం ద్వారా జిల్లాలో 244 కిలోమీటర్లు సిమెంటు రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, 177 కిలోమీటర్ల మేర పనులు మంజూరు చేశాము. 169 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు పూర్తయ్యాయి.
 ప్రశ్న: ఈ ఏడాది ఉపాధి హామీ పథకం అమలుకు ఎంత బడ్జెట్‌ కేటాయించారు?
జవాబు: జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు ద్వారా కూలీలకు 97లక్షల పనిదినాలు కల్పించడానికి రూ.345కోట్లు బడ్జెట్‌ కేటాయించారు. ఇందులో 40 శాతం అనగా రూ.110 కోట్లుమెటీరియల్‌ కాస్ట్‌ ఉంటుంది. ఈ నిధులను సీసీరోడ్లు, మొక్కల పెంపకం, డబ్లు్యబీఎం రోడ్లు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం వినియోగిస్తున్నాము..
ప్రశ్న: ఎన్టీఆర్‌ జలసిరి కార్యక్రమం ఎలా సాగుతోంది?
జవాబు: ఎన్టీఆర్‌ జలసిరి పథకం ద్వారా రైతుల పొలాల్లో బోర్లు వేసి, కరెంటు ఇచ్చి, మోటర్‌ ఇవ్వడం
జరుగుతుంది. ఈ పథకం కింద 285 టార్గెట్‌ ఇవ్వగా 284 మంజూరు చేయడం జరిగింది. ఈ పథకం
అమలులో కూడా మనమే మొదటి స్థానంలో ఉన్నాము.

ప్రశ్న: చివరగా సోషల్‌ ఆడిట్‌లో రికవరీలు ఎలా ఉన్నాయి. సిబ్బంది సహకారం ఎంత?
జవాబు: ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సిబ్బంది పనిచేస్తే అభినందిస్తాం, లేదంటే ఒకట్రెండు ఛాన్సులచ్చి చర్యలు తీసుకుంటాము. సోషల్‌ ఆడిట్‌లో రికవరీలు బాగానే ఉన్నాయి.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement