ఇదేనా.. పనిచేసే తీరు | Sakshi
Sakshi News home page

ఇదేనా.. పనిచేసే తీరు

Published Fri, Apr 21 2017 11:55 PM

ఇదేనా.. పనిచేసే తీరు - Sakshi

ఏలూరు (మెట్రో) :  కాలువలు మూసివేసిన తర్వాత ఇప్పుడు గుర్రపు డెక్క, తూడు తొలగింపు విషయంలో టెండర్లు పిలుస్తారా అంటూ ఇరిగేషన్‌ అధికారులపై కలెక్టర్‌ భాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయాలనే ఆలోచన ఉంటే ముందుగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారని, పని చేయకూడదనే ఆలోచన ఉంటేనే ఇటువంటి పనులు చేస్తారని మండిపడ్డారు. ఇటువంటి పద్ధతి విడనాడాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఇరిగేషన్‌ అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తీరుపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సాగునీటి కాలువ మరమ్మతులు, డెల్టా ఆధునికీకరణ కార్యక్రమాలు, కాలువలు మూసి వేసిన తరువాత చేపట్టాల్సి ఉన్నప్పటికీ కాలువలు తెరిచిన తరువాత పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. చీఫ్‌ ఇంజనీర్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి వాటి అనుమతులు పొందుతామని తెలిపారు.  పోలవరం ఆరోగ్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేసినట్టు కాగితంపై చూపిస్తే కుదరదనీ, డాక్టర్లు, సిబ్బంది నియామకానికి తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. సిబ్బందిని మంజూరు చేయిస్తానని జిల్లా వైద్యాధికారి కోటేశ్వరికి చెప్పారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో కష్టపడి పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకొచి్చన పంచాయతీరాజ్‌ ఏఈ మాణిక్యాన్ని కలెక్టర్‌ అభినందించారు.  వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా డబ్ల్యూఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ కట్టా హైమావతి, డీపీఓ సుధాకర్, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement