కోర్టు కానిస్టేబుళ్లా.. మజాకా ! | Sakshi
Sakshi News home page

కోర్టు కానిస్టేబుళ్లా.. మజాకా !

Published Tue, Feb 28 2017 10:45 PM

కోర్టు కానిస్టేబుళ్లా.. మజాకా ! - Sakshi

కేసు వస్తే సంపాదనే సంపాదన
జరిమానా గోరంత.. వసూలు కొండంత
ఏళ్ల తరబడి పాతుకుపోయిన వైనం


తిరుపతి క్రైం : తెలిసో తెలియకో తప్పులు చేసిన వారికి కోర్టు వేసే జరిమానా కన్నా కోర్టు కానిస్టేబుళ్లకే ఎక్కువగా ఖర్చు అవుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ విషయం చిన్నదైనా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారంలో రోజూ వేల రూపాయలు అక్రమార్కులు జేబుల్లోకి వెళుతున్నట్టు సమాచారం. అడిగినంత ఇవ్వకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు వద్ద పడిగాపులు కాయాల్సిందేనని ఆయా కానిస్టేబుళ్లు బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే కోర్టుకు వచ్చే కేసులను తమకు అనుకూలమైన న్యాయవాదులకు అప్పగిస్తున్నారని,  సంబంధిత న్యాయవాదులు నిందితుల నుంచి అత్యధికంగా డబ్బు తీసుకుని కానిస్టేబుళ్లకు కమీషన్‌ ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కోర్టు బయట జరుగుతుండడంతో వీరిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆయా కానిస్టేబుళ్లు ఆడిందే ఆటగా.. పాడింది పాటగా మారింది.

పిట్టీ కేసులతోనే ఎక్కువ కాసులు
చిన్న పాటి నేరాలు చేసి చిక్కిన వారిపై పోలీసులు పిట్టీ కేసులు నమోదు చేస్తారు. తర్వాత నిందితులను కోర్టు కానిస్టేబుల్‌ ద్వారా కోర్టుకు పంపుతారు. న్యాయమూర్తి వీరికి కొంతమేర జరిమానా విధిస్తారు. ఆ జరిమానాను కోర్టు కానిస్టేబుల్‌ అక్కడే కోర్టులోనే కట్టిస్తాడు. అనంతరం ఖర్చుల పేరుతో జరిమానాకు రెట్టింపు వసూలు చేస్తున్నారని బా«ధితులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, పేకాట రాయళ్లు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో నిందితులే ఆదాయ వనరులుగా మారుతున్నారు. ఇలాంటి కేసులు జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్‌ నుంచి రోజుకు 10 నుంచి 20 కేసులు కోర్టుకు వస్తుంటాయి. నిందితుల నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదాయ వనరులుగా మారిన ఈ కొలువు నుంచి వేరొక చోటికి వెళ్లేందుకు సంబంధిత కానిస్టేబుళ్లు ఇష్టపడడం లేదనే విమర్శలు ఉన్నాయి.  

న్యాయవాదులతో ఒప్పందం
కోర్టు కానిస్టేబుళ్లు కొందరు న్యాయవాదులతో ఒప్పం దం కుదుర్చుకుని కేసులను అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన బయట ప్రాంతాల వారికి స్థానిక కోర్టుల్లో న్యాయవాదుల గురించి అంతగా తెలియదు. వారు మధ్యవర్తి అవతారం ఎత్తి ఫలానా న్యాయవాది మీకు తొందరగా బెయిల్‌ ఇప్పిస్తారని, కేసు గెలుస్తారని చెప్పి తమకు అనుకూలమైన వారి వద్దకు తీసుకెళుతున్నారు. తద్వారా వారి నుంచి భారీగా ముడుపులు తీసుకుంటున్నట్టు సమాచారం. కొందరు జూనియర్లకు కేసులు అప్పగించి వారికి కొద్దోగొప్పో ఇచ్చి మిగిలిందంతా దోచుకుంటున్నారని సీనియర్‌ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

కోర్టు కానిస్టేబుల్‌ విధులు ఇవే..
జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒక కోర్టు కానిస్టేబుల్‌ ఉంటాడు. కోర్టులో నమోదయ్యే కేసులను, సంబంధిత వివరాలను కోర్టుకు సమర్పించడం, వాయిదాలకు హాజరుకావడం, చార్జిషీట్లను అప్పగించడం, పిట్టీ కేసుల్లో నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం, వారి నుంచి జరిమానా కట్టించడం వారి పనులు. ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఈ పోస్టులకు తీవ్రమైన పోటీ ఉంటోంది. స్టేషన్‌ అధికారి ఇష్టమైన వారికే ఈ పోస్టులు కట్టబెడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తవారికి ఈ పని అప్పగించరు. పాతవారినే కొనసాగిస్తుండడంతో అవినీతి పెరిగిపోతోందని పోలీసులు, న్యాయవాదులు చెబుతున్నారు. తరచూ కానిస్టేబుళ్లను మార్చడం ద్వారా అవినీతిని అరికట్టవచ్చని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement