టాలెంట్‌ ఉంటే.. సినీ ఇండస్ట్రీ బెస్ట్‌ | Sakshi
Sakshi News home page

టాలెంట్‌ ఉంటే.. సినీ ఇండస్ట్రీ బెస్ట్‌

Published Fri, Sep 9 2016 7:57 AM

టాలెంట్‌ ఉంటే.. సినీ ఇండస్ట్రీ బెస్ట్‌

ఆయన స్టేజీ ఎక్కితే నవ్వుల పువ్వులు పూస్తాయి. వెరైటీ డైలాగులు.. ఆకట్టుకునే హాస్యంతో ఎందరో అభిమానుల మనసుదోచుకున్న కమెడియన్‌ చలాకీ చంటి. వినాయకచవితి సందర్భంగా కైకలూరు నియోజకవర్గం, మండవల్లి మండలం లింగాల గ్రామంలో అత్తవారింటికి వచ్చిన చంటి బుధవారం   విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
– మండవల్లి (కృష్ణాజిల్లా)
 
సాక్షి : హాయ్‌ చంటి.. ఎలా ఉన్నారు?
చంటి : బాగానే ఉన్నానండి.
 
సాక్షి : షూటింగ్‌లతో బాగా బిజీగా ఉన్నట్టున్నారు?
చంటి : నిజమే.. ‘తనువచ్చెనంట’ సినిమా షూటింగ్‌ ఈ ప్రాంతంలోనే జరుగుతోంది. తేజ్‌ హీరో, లక్ష్మి హీరోయిన్‌. సెప్టెంబర్‌ 16న విడుదల. ఆ సినిమా షూటింగ్‌ బిజిబిజీ.
 
సాక్షి : మీ కుటుంబ నేపథ్యమేమిటి? 
చంటి : పుట్టింది హైదరాబాద్‌. బీకామ్‌ వరకూ చదువుకున్నాను. అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య వద్ద పెరిగాను. మా అమ్మానాన్నకు ఇద్దరు మగపిల్లలం. నాన్న, అన్నయ్య వ్యాపారం చేస్తుంటారు. 
 
సాక్షి : మొదటి నుంచీ టీవీ రంగంలోనే ఉన్నారా?
చంటి : లేదు. నేను మొట్టమొదట టాటా ఇండికాలో మార్కెటింగ్‌ శాఖలో ఉద్యోగం చేశాను.
 
సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు
చంటి : చాలా సినిమాల్లోనే నటించినా.. టీవీ షోలతో నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకు 50 సినిమాల్లో నటించాను. 
 
సాక్షి : సినిమాల్లో చాన్స్‌ ఎలా వచ్చింది?
చంటి : వీవీ నారాయణ సినిమా చాన్స్‌ ఇచ్చారు. చందమామ డైరెక్టర్‌ యతిరాజ్‌ భూపాల్‌ పేరు ఇచ్చారు. ‘భీమిలి కబడ్డీ’ సినిమాలో తాతినేని సత్య పాత్ర నాకు టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది.
 
సాక్షి : సినిమాల్లో మీకు స్ఫూర్తి ఎవరు?
చంటి : సినీ పరిశ్రమలో ఎలా ఉండాలో బ్రహ్మానందం చెప్పారు. ఎలా ఉండకూడదో ఆలీ చెప్పారు.
 
సాక్షి : నేడు సినిమాల్లోకి యువత అధికంగా వస్తోంది కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
చంటి : ఎల్లుండి తినే బిర్యానీ కోసం ఇవాళ ఇడ్లీ మానుకోకూడదు. చేసే పని చెడగొట్టుకుని రావడం తగదు.
 
సాక్షి : కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారికి మీరిచ్చే సూచన
చంటి : సినిమా ఇండస్ట్రీ ఏదో ఇస్తుందని వస్తున్నారు. అలా ఉండకూడదు. ముందుగా వారు చేసే వృత్తిలో డబ్బులు వెనుకేసుకుని రావాలి. టాలెంట్‌ ఉన్నవారందరినీ సినీ పరిశ్రమ ఆదరిస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement