ఇష్టం ఉంటే చేయండి.. లేకుంటే లేదు | Sakshi
Sakshi News home page

ఇష్టం ఉంటే చేయండి.. లేకుంటే లేదు

Published Sat, Jul 30 2016 9:22 AM

ఇష్టం ఉంటే చేయండి.. లేకుంటే లేదు - Sakshi

రూ. పదివేల వేతనం సరిపోవడం లేదా?
ఏఎన్‌ఎంలను ప్రశ్నించిన జెడ్పీ చైర్‌పర్సన్‌


వికారాబాద్‌ రూరల్‌ : ‘పనిచేస్తే రూ.10 వేలు ఇస్తున్నారు కదా.. అవి సరిపోవా.. సరిపోక పోతే వెళ్లిపోండి. చాలా మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచులకు కేవలం రూ.5 వేలు వస్తున్నాయి.. వారికంటే ఎక్కువ కావాలా మీకు’ అని జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి ఏఎన్‌ఎంలను ప్రశ్నించారు. శుక్రవారం హరితాహారంలో పాల్గొన్న ఆమె వికారాబాద్‌ అతిథిగృహానికి చేరుకున్నారు. అదే సమయంలో ఏఎన్‌ఎంలు ర్యాలీగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే సంజీవరావులకు వినతిపత్రం సమర్పించారు. తమకు కేవలం రూ.10 వేల జీతం వస్తుందని.. జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వాలని వారికి విన్నవించారు.

దీంతో జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ‘మీకు 10 వేలు వస్తున్నాయి అక్కడ ప్రజా ప్రతినిధులు సర్పం‍చులకు కేవలం 5 వేలు జీతం మాత్రమే వస్తుంది. మీకు రూ. 10 వేలు సరిపోవా అంటూ ఘాటుగా స్పందించారు. మీకు  ఇష్టం ఉంటే పని చేయండి లేకుంటే మానేయండి. చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఎప్పుడు ప్రభుత్వం ఏమీ చేయడం లేదనడమేన మీ పని అని ఆగ్రహిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు నినాదాలు చేశారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంల డివిజన్‌ అధ్యక్షురాలు అనిత, నాయకురాలు శోభరాణి, ఏఎన్‌ఎంలు అనంతమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement