తిండీ తిప్పలూ లేకుండా కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

తిండీ తిప్పలూ లేకుండా కౌన్సెలింగ్‌

Published Wed, Aug 17 2016 11:41 PM

తిండీ తిప్పలూ లేకుండా కౌన్సెలింగ్‌

నూజివీడు :
నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహణ సందర్భంగా సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం రాత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 555 సీట్ల భర్తీకి గాను వెయిటింగ్‌ జాబితాలో ఉన్న దాదాపు 1665 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు నూజివీడు ట్రిపుల్‌ఐటీకి పిలిచారు. అంతమంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రావడంతో దాదాపు 4వేల మంది అయ్యారు. వీరంతా మంగళవారం  ఉదయం 8గంటలకు కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. కౌన్సెలింగ్‌ దాదాపు పగలు, రాత్రి కలిపి 24గంటల పాటు జరిగింది. వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
కొనుక్కునే వీలూ లేదు  
మధ్యాహ్న భోజనంను తక్కువ ధరకు అందజేసినా రాత్రి  భోజనం ఏర్పాటు చేయలేదు. తాగునీరు, టాయ్‌లెట్‌ వసతీ లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా గొడవకు దిగారు. కొనుక్కుని తినడానికి కూడా భోజనం, నీరు లేదంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. చివరకు దిగివచ్చిన అధికారులు మహిళలు అక్కడి టాయ్‌లెట్లను వాడుకోవడానికి అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది. తల్లిదండ్రులు సిమెంట్‌రోడ్లపైన, సిబ్బంది క్వార్టర్ల సెల్లార్‌లలో పడుకుని నిద్రపోయారు. 
 

Advertisement
Advertisement