ఎముకల డంపింగ్‌కు యత్నం | Sakshi
Sakshi News home page

ఎముకల డంపింగ్‌కు యత్నం

Published Wed, Sep 14 2016 6:45 PM

ఎముకల లోడ్‌తో వచ్చిన లారీలు

  • అడ్డుకున్న ధన్వార్‌ వాసులు
  • హైదరాబాద్‌ నుంచి వచ్చిన తొమ్మిది లారీలు
  • తహసీల్దార్‌కు ఫిర్యాదు.. ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున జరిమానా
  • మనూరు: పశువుల ఎముకలు, పుర్రెలను కొందరు వ్యక్తులు బుధవారం తొమ్మిది లారీల్లో మండలంలోని ధన్వార్‌ శివారుకు తీసుకొచ్చారు. అక్రమంగా డంపింగ్‌కు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించి వదిలేశారు. వివరాలు ఇలా..

    హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్ట నుంచి న్యాల్‌కల్‌ మీదుగా మనూరు మండలం ధన్వార్‌కు తొమ్మిది లారీల్లో పశువుల ఎముకలు చేరుకున్నాయి. గ్రామానికి చెందిన మహ్మద్‌ అజీమొద్దీన్‌ వచ్చి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో డంపింగ్‌కు యత్నించాడు. తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి డంప్‌ను అడ్డుకున్నారు.

    ఈ ప్రాంతంలో డంప్‌ చేయడానికి ఎవరు అనుమతినిచ్చారని లారీ డ్రైవర్లను నిలదీశారు. ధన్వార్‌కు చెందిన మహ్మద్‌ అజిమొద్దీన్‌ చేల్లో డంపింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో స్థానికులు మనూరు తహసీల్దార్‌ తారాసింగ్‌కు ఫోన్‌లో సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు సమాచారమిచ్చి సంఘటన స్థలానికి రెవెన్యూ సిబ్బందిని పంపించారు.

    పోలీసులు కూడా అక్కడికి చేరుకుని లారీలను పరిశీలించారు. విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు ఒక్కో లారీకి రూ.వెయ్యిచొప్పున జరిమానా విధించి లారీలను తిప్పి పంపినట్టు ఏఎస్‌ఐలు రఫియొద్దీన్‌, సదానందం తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement