రోడ్లకు ప్రపంచస్థాయి మెరుగులు | Sakshi
Sakshi News home page

రోడ్లకు ప్రపంచస్థాయి మెరుగులు

Published Tue, Oct 20 2015 3:09 AM

Improvements to roads in the world range

రాష్ట్రమంతటా బీటీ, సీసీ రోడ్లకూ వైట్ టాపింగ్
సిమెంటు కంపెనీలతో మంత్రుల చర్చలు

 
 సాక్షి, హైదరాబాద్: మన రోడ్లకు మంచిరోజులు. త్వరలో రాష్ట్రంలోని బీటీ, సీసీ రోడ్లన్నింటినీ వైట్ టాపింగ్ టెక్నాలజీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం రాజధాని నగరం హైదరాబాద్‌లోనే రెండు నెలల వ్యవధిలో 400 నుంచి 500 కి.మీ. మేర అంతర్గత రహదారులను వైట్ టాపింగ్ టెక్నాలజీతో వేయనుంది. నూతన టెక్నాలజీని వినియోగించేందుకు పెద్దఎత్తున సిమెంటు అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు.

నాణ్యత, మన్నికతో పాటు తక్కువ వ్యయం, తక్కువ వ్యవధిలో రోడ్లు వేసే అవకాశం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుందన్నారు. గతం లో సిమెంటు కొరత, సాంకేతిక  పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఈ టెక్నాలజీ వాడలేకపోయామని తెలిపారు. ప్రస్తుత రోడ్లపైనే కాంక్రీట్, ఫైబర్‌ను కలగలిపి కొత్త విధానంలో రోడ్లు వేస్తామన్నారు. త్వరలో నూతన విధానాన్ని జిల్లాలు, గ్రామాలకూ తీసుకెళ్లి బీటీ, సీసీ రోడ్లన్నింటినీ వైట్ టాపింగ్ రోడ్లుగా మార్చుతామని చెప్పారు. 1,060 కి.మీ. మేర నిర్మించిన యమునా ఎక్స్‌ప్రెస్ వే, ముంబై మెరైన్ డ్రైవ్ తదితరాలను వైట్ టాపింగ్ పద్ధతిలో నిర్మించిన విషయాన్ని ఉదహరించారు.

వైట్ టాపింగ్ రోడ్లు కనీసం 25-30 ఏళ్ల పాటు మన్నే అవకాశం ఉన్నందున మరమ్మతుల వ్యయం కూడా పెద్దగా ఉండదన్నారు. రోడ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా సిమెంటు అవసరమని చెప్పగా, ఒక్కో బస్తాను రూ.250 చొప్పున ఇచ్చేందుకు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ధరలపై పునరాలోచించాలని మంత్రులు సూచించగా, మరోమారు కొత్త ప్రతిపాదనతో వస్తామని ప్రతినిధులు చెప్పారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement