కాల్పుల ఘటనలో ముగ్గురి అరెస్టు | Sakshi
Sakshi News home page

కాల్పుల ఘటనలో ముగ్గురి అరెస్టు

Published Sun, Sep 25 2016 11:32 PM

నిందితుల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్‌ - Sakshi

– మరో నలుగురి కోసం గాలింపు
చిత్తూరు (అర్బన్‌): ఈ నెల 4వ తేదీన చిత్తూరు నగరంలోని పెనుమూరు క్రాస్‌ వద్ద జరిగిన కాల్పుల కేసులో ముగ్గురు నిందితుల్ని శనివారం పోలీసులు అరెస్టు చూపించారు. నిందితుల్లో టి.శ్రీనివాస్‌ (28) అనే వ్యక్తిని ఈ నెల 22న హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. జి.కుమార్‌నాయుడు (33), ఎ.శివకుమార్‌ (29)ను శనివారం రంగంపేట క్రాస్‌ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఆయన ఆదివారం తాలూకా పోలీసు స్టేషన్‌లో విలేకరుల వివరాలు వెల్లడించారు. గంగాధరనెల్లూరు గ్యారంపల్లెకు చెందిన జి.కుమార్‌నాయుడుకు అదే గ్రామానికి చెందిన విశ్వనాథనాయుడుకు ఎన్నికల గొడవలు ఉన్నాయి. కుమార్‌నాయుడు హైదరాబాదులో తనకున్న పరిచయాలతో జార్ఖండ్‌కు చెందిన కిరాయి వ్యక్తుల్ని చిత్తూరుకు పిలిపించి విశ్వనాథనాయుడిని హత్య చేయాలని, ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తాని చెప్పాడు. ఈ నెల 4వ తేదీన పెనుమూరు క్రాస్‌ వద్ద కాపుకాచారు. అప్పటికే విశ్వనాథనాయుడు వెళ్లిపోవడంతో పథకం మార్చాలని కుమార్‌నాయుడు చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న కిరాయి వ్యక్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో పక్కనే ఉన్న మురుగారెడ్డి ఇంట్లోకి చొరబడి దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరపగా మురుగారెడ్డి కుమారుడు దినేష్‌ ఛాతీకి ఓ బుల్లెట్‌ తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో బుల్లెట్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. కేసు దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. జార్ఖండ్‌ రాష్ట్రం డాల్టన్గంజ్‌ పట్టణానికి చెందిన టి.శ్రీనివాస్‌తో హైదరాబాదులో ఉన్న పరిచయంతో కుమార్‌నాయుడు బేరం కుదుర్చుకోవడంతో అతను మరో ఐదుగురిని చిత్తూరు తీసుకొచ్చి కాల్పులకు పాల్పడినట్టు తేలింది. ఈ కేసులో జార్ఖండ్‌కు చెందిన మరో నలుగుర్ని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. కేసు ఛేదనలో శ్రమించిన ఎస్‌ఐలు కళావెంటక్రమణ, రామకృష్ణారెడ్డి, విశ్వనాథరెడ్డితో పాటు సిబ్బంది కుమార్, రుక్మాంగద నాయుడు, ప్రవీణ్‌లకు ఎస్పీ చేతులు మీదుగా రివార్డులు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement