ఇన్‌సర్వీస్‌ పీహెచ్‌డీకి మంగళం | Sakshi
Sakshi News home page

ఇన్‌సర్వీస్‌ పీహెచ్‌డీకి మంగళం

Published Wed, Aug 17 2016 10:37 PM

పాల్గొన్న అధికారులు

–వచ్చే ఏడాది నుంచి అమలు
–వెటర్నరీ వర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌లో నిర్ణయం


యూనివర్సిటీ క్యాంపస్‌: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఇన్‌సర్వీస్‌ పీహెచ్‌డీకి మంగళం పాడారు. ఇన్‌ సర్వీసులో ఉన్న అధ్యాపకులు, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లకు వచ్చే ఏడాది నుంచి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్మిషన్‌ ఇవ్వదు. అలాంటి వారు పీహెచ్‌డీ చేయాలంటే ఇతర రాష్ట్రాల్లోని వెటర్నరీ యూనివర్సిటీల్లో చేరవచ్చు. ఈ మేరకు బుధవారం వెటర్నరీ యూనివర్సిటీలో జరిగిన అకడమిక్‌ కౌన్సెల్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌చార్జ్‌ వీసీ మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 43 అంశాలపై చర్చ సాగింది. పీజీ అడ్మిషన్లలో స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా కింద ఒకరికి అడ్మిషన్‌ ఇవ్వాలని తీర్మానించారు. ప్రైవేట్‌ రంగంలో వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అనుమతులు ఇవ్వడానికి నియమావళి, నిబంధనలను రూపొందించేందుకు మాజీ వెటర్నరీ వీసీలతో కమిటీ వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పశుసంవర్థక, మత్స్య, డెయిరీ టెక్నాలజీ రంగాల్లో కళాశాలలు, పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి 2 వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. 6 పశుసంవర్థక, 2 డెయిరీ, 5 ఫిషరీ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అకడమిక్‌ కౌన్సిల్‌ ప్రయివేట్‌ రంగంలో వీటి ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీ వేయాలని తీర్మానించారు. వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పశుసంవర్థక శాఖ నుంచి వచ్చిన అధ్యాపకులకు పే–ప్రొటక్షన్‌ ఇవ్వాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. వెటర్నరీ యూనివర్సిటీలోని అనుబంధ వెటర్నరీ శస్త్రచికిత్స కేంద్రాల్లో యూజర్‌ చార్జీలను తగ్గించారు. కోళ్లు, గొర్రెలు, మేకలు, ఇతర చిన్న జంతువులకు ఎలాంటి యూజర్‌ చార్జీలు ఉండవు. ఆవులు, గేదెలకు ప్రస్తుతం ఉన్న వేయి రూపాయల యూజర్‌ చార్జీలను 200 రూపాయలకు తగ్గించారు. ఎల్‌పీటీ విభాగంలో రెండు, న్యూట్రిషన్‌ విభాగంలో ఒక గోల్డ్‌ మెడల్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇకపై యూనివర్సిటీలో ఎవరైనా తమ పేరిట గోల్డ్‌ మెడల్‌ ఏర్పాటు చేయాలంటే రెండు లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సుధాకర్‌ రెడ్డి, డీన్లు చంద్రశేఖర్‌రావు, పద్మనాభరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి వేణుగోపాల్‌ నాయుడు, బోర్డు సభ్యులు కరుణానిధి, సూర్యనారాయణ, విస్తరణ సంచాలకులు శోభామణి, పరిశోధన డీన్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement