ఆరంభంలోనే అన్నదాతకు నరకం | Sakshi
Sakshi News home page

ఆరంభంలోనే అన్నదాతకు నరకం

Published Thu, Jun 23 2016 8:19 AM

In the beginning of hell to Anndata

విత్తనాల కోసం గంటల తరబడి పడిగాపులు
డిమాండ్ ఎక్కువ.. వచ్చింది తక్కువ
ఎరువులదీ అదే పరిస్థితి

ఈ లైను చూస్తుంటే వీరేమి తమ అభిమాన  హీరో సినిమా చూసేందుకు టికెట్ల కోసం లైన్లో నిల్చున్న ప్రేక్షకులు కాదు.  పుడమితల్లిని నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు ఆరుగాలం శ్రమించే అన్నదాతలు. విత్తనాల కోసం వీరుపడుతున్న పాట్లకు ఇవే సాక్ష్యాలు. వర్షాలు బాగా పడతాయంటూ వాతావరణ శాఖ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో కనీసం ఈ సీజన్‌లోనైనా తమ కష్టాలు గట్టెక్కుతాయన్న గంపెడాశతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న  రైతన్నకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి.  విత్తు దొరక్క మళ్లీ చిత్తవుతున్నారు.

 

విశాఖపట్నం:  ఖరీఫ్ దుక్కులు దాదాపు పూర్తికావచ్చాయి. నారుమళ్లు వేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.రుణమాఫీ పుణ్యమాని బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులు ఒకవైపు భయపెడుతున్నాయి. మరో పక్క బ్యాంకుల నుంచి ఇంకా చేతికి పైసా రుణం అందక పోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.3 నుంచి రూ.5ల వడ్డీకి అప్పులు చేసి రైతన్నలు విత్తనాలు, ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కోసం యుద్ధాలు చేస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరుతూ   అష్టకష్టాలుపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో లక్షా 05 హెక్టార్లకు తక్కువకాకుండా వరి, 37వేల హెక్టార్లలో చెరకు, 42వేల హెక్టార్లలో మిల్లెట్స్ (చిరుధాన్యాలు), 17 వేల హెక్టార్లలో అపరాలు సాగుచేయాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన వ్యవసాయశాఖ  అందుకనుగుణంగానే విత్తనాల కోసం ఇండెంట్ పెట్టింది. 

 
డిమాండ్ కొండంత.. వచ్చింది గోరంత

జిల్లాకు 76 వేల క్వింటాళ్లకు ైపైగా విత్తనాలు అవసరం. జిల్లా వ్యవసాయ శాఖ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కనీసం 36 వేల క్వింటాళ్ల విత్తనాలైనా కావాలని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టారు. కాాని జిల్లాకు   20 వేల క్వింటాళ్లు కూడా చేరలేదు. ముఖ్యంగా ఆర్‌జేఎల్ విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.  డిమాండ్‌కు తగ్గట్టుగా విత్తనాలు కేంద్రాలకు చేరలేదు. ఆర్‌జేఎల్ రకం విత్తనాలు కనీసం 25 వేల క్వింటాళ్ల అవసరం కాగా, వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి 12,500 క్వింటాళ్ల కోసం ఇండెంట్ పెట్టింది.   జిల్లాకు ఇప్పటి వరకు చేరింది మాత్రం  6వేల క్వింటాళ్ల లోపే. దీంతో ఈ రకం విత్తనాలు దక్కించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక వైపు నాట్లు వేసుకునే సమయం ముంచుకొస్తుండడంతో మరో వైపు డిమాండ్‌కు తగ్గట్టు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. పీఏసీఎస్‌లు, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచారు. డిమాండ్ మేరకు విత్తనాలు రాకపోవడంతో రైతులు ఎక్కడ తమకు దక్కకుండా పోతాయోననే ఆందోళనతో పీఎసీఎస్‌లు, వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అనకాపల్లి, మునగపాక, రాంబిల్లి, చోడవరం తదితర ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వందలాది మంది రైతులు క్యూలైన్లలో నిల్చుని విత్తనాల దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అనకాపల్లితో సహా పలు ప్రాంతాల్లో పోలీసుల పహరా మధ్య విత్తనాలు సరఫరా చేస్తుండడం కనిపించింది. గతేడాది కూడా ఇదే రీతిలో ఖాకీల నీడలోనే విత్తనాలు, ఎరువులు సరఫరా చేయగా తొక్కిసలాట  చోటుచేసుకుంది. అప్పట్లో ఒకరిద్దరి రైతులకు తీవ్ర గాయాలుకూడా అయ్యాయి. అయినా సరే సర్కార్‌లో మార్పు కనిపించలేదు. మళ్లీ అదే సీన్ రీపీట్ అవుతోంది. అనకాపల్లి పట్టణంలోని గౌరీ, అన్నపూర్ణ పీఏసీఎస్‌ల వద్ద బుధవారం విత్తనాల విక్రయాలను  ప్రారంభించారు. విత్తన విక్రయ కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం ఏర్పడడం, అదే సమయంలో రైతులు పోటెత్తడంతో తోపులాటలు జరగడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అన్నపూర్ణ పీఏసీఎస్ వద్ద రైతులు తోపులాటలకు గురికాగా  బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ రైతులను కంట్రోల్ చేసేందుకు  పట్టణ ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలోని పోలీసులు నానాపాట్లు పడ్డారు. ముఖ్యంగా ఆర్‌జేఎల్ 2537 కోసం రైతులు డిమాండ్ చేయగా ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అన్న చందంగా అధికారులు విక్రయించారు. 

 
ఎరువుల పరిస్థితి అంతే...

యూరియా 2014-15లో 45,253 మెట్రిక్ టన్నులు వాడితే 2015-16లో 42,130 ఎంటీలకు తగ్గింది. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం యూరియా 50,342 ఎంటీలు, డీఏపీ 12,334 ఎంటీలు, ఎంవోపీ 12,096 ఎంటీలు, ఎస్‌ఎస్‌పీ 11,670 ఎంటీలు, కాంప్లెక్స్ ఎరువులు 10,889 ఎంటీలు ఇండెంట్ పెట్టారు. కానీ డిమాండ్‌కు తగ్గట్టు ఎరువులు కూడా జిల్లాకు చేరలేదు.

 

ఆందోళన అవసరం లేదు.. జేడీ
విత్తనాలకోసం ఇప్పటికే ఇండెంట్ పెట్టాం. అవసరమైన విత్తనాలు జిల్లాకు వస్తున్నాయి. ఇప్పటికే 26 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధ చేశాం. మిగిలిన విత్తనాలు కూడా అతి త్వరలోనే వచ్చేస్తాయి. విత్తనాల కొరత ఏర్పడుతుందని ఏ ఒక్క రైతు ఆందోళన చెంద నవసరం లేదు. ప్రతీ రైతుకు విత్తనం అందేలా ఏర్పాటు చేస్తన్నాం.  - వి.సత్యనారాయణ, జేడీ, వ్యవసాయ శాఖ

 

Advertisement
Advertisement