మూడు మార్కెట్ల ఆదాయం పతనం | Sakshi
Sakshi News home page

మూడు మార్కెట్ల ఆదాయం పతనం

Published Fri, Sep 8 2017 10:39 PM

మూడు మార్కెట్ల ఆదాయం పతనం - Sakshi

- నాలుగు నెలలైనా 10 శాతం లోపు వసూళ్లు
- కమిషనర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ సీరియస్‌ హెచ్చరిక


అనంతపురం అగ్రికల్చర్‌: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మార్కెట్‌ యార్డుల ఆదాయం తగ్గుముఖం పడుతూ వస్తోంది. అందులోనూ మూడు యార్డుల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు పూర్తయినా నిర్దేశిత లక్ష్యంలో తనకల్లు కేవలం 8.40 శాతం సాధించి చివరి స్థానంలో ఉండగా ఆ తర్వాత 9.45 శాతం సాధనతో ధర్మవరం, 9.60 శాతంతో రాయదుర్గం యార్డులు పూర్తిగా వెనుకబడ్డాయి.

10 శాతం లోపు వసూళ్లు:
ఐదు నెలలు పూర్తయినా ఈ యార్డుల్లో 10 శాతం కూడా వసూళ్లు కాకపోవడంతో మిగతా 90 శాతం ఎలా సాధించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రాయదుర్గం లక్ష్యం రూ.1.17 కోట్లు కాగా కేవలం రూ.11.23 లక్షలు, ధర్మవరంలో రూ.60 లక్షలకు గానూ రూ.5.67 లక్షలు, తనకల్లులో రూ.58 లక్షలకు గానూ కేవలం రూ.4.88 లక్షలు మాత్రమే వసూలు కావడం విశేషం. ఈ మూడింట ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఆ శాఖ కమిషనర్, ఆర్జేడీలు సీరియస్‌గా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న 13 మార్కెట్‌యార్డుల ద్వారా వివిధ రూపాల్లో మార్కెటింగ్‌ ఫీజు రూ.14.61 కోట్లు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ నాలుగు నెలల కాలంలో 26.30 శాతంతో రూ.3.84 కోట్లు సాధించారు.

వసూళ్లలో 36.22 శాతంతో అనంతపురం యార్డు ప్రథమ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో గుంతకల్లు 35.84 శాతం, హిందూపురం 34.90 శాతం వసూళ్లలో ముందంజలో కొనసాగుతున్నాయి. మిగతా వాటిలో తాడిపత్రి 27.69 శాతం, మడకశిర 24.33 శాతం, కదిరి 23.31 శాతం, గుత్తి 22.76 శాతం, ఉరవకొండ 22.35 శాతం, పెనుకొండ 19.77 శాతం, కళ్యాణదుర్గం 14.77 శాతం వసూళ్లలో వెనుకడ్డాయి.   ముందంజలో మూడు మార్కెట్లు, మరో మూడు యార్డులు పూర్తిగా వెనుకబడిపోయాయి. మిగతా ఏడు మార్కెట్‌యార్డుల ఆదాయం మధ్యస్థంగా ఉన్నాయి.

మార్కెట్‌శాఖ కమిషనరు ఆగ్రహం :
వారం రోజుల కిందట జిల్లాకు వచ్చిన ఆశాఖ కమిషనర్‌ శామ్యూల్‌ ఆనంద్‌, ఆర్జేడీ సి.సుధాకర్‌ మార్కెట్‌ ఫీజు వసూళ్లపై ఆరాతీయగా... వెనుకబడిన యార్డుల సెక్రటరీ, సూపర్‌వైజర్లపై సీరియస్‌ అయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గడువులోపు లక్ష్యం సాధించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. సమీక్షలు, పర్యవేక్షణతో అన్ని మార్కెట్‌యార్డులు వంద శాతం లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఏడీ బి.హిమశైలను కమిషనర్‌ ఆదేశించినట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement