రైలు మార్గాలతో పారిశ్రామికాభివృద్ధి | Sakshi
Sakshi News home page

రైలు మార్గాలతో పారిశ్రామికాభివృద్ధి

Published Sat, Dec 31 2016 12:24 AM

రైలు మార్గాలతో పారిశ్రామికాభివృద్ధి

రాయదుర్గం–కళ్యాణదుర్గం రైలు మార్గం ప్రారంభోత్సవంలో ఎంపీ జేసీ  
రాయదుర్గం :  రైలు మార్గాల ఏర్పాటుతో నూతన పరిశ్రమలు వస్తాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం – కళ్యాణదుర్గం నూతన రైలు ప్రారంభం సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫాంపై సౌత్, వెస్ట్రన్ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఏకే గుప్తా అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ జేసీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జెడ్పీ చైర్మన్ చమన్సాబ్, ప్రభుత్వ చీఫ్‌విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2007–08లో రాయదుర్గం నుంచి తుంకూరు వరకు 207 కి.మీ నూతన రైలు మార్గం మంజూరైందన్నారు. ఇందులో రైల్వే వాటా రూ.857.25 కోట్లు కాగా, ఏపీ వాటా రూ.390.17 కోట్లు, కర్ణాటక వాటా రూ.467.08 కోట్లు అన్నారు. 2018 లోగా పూర్తి కావాల్సి ఉందని, అయితే రెవెన్యూ అధికారులు భూసేకరణలో జాప్యం చేయడంతో ప్రస్తుతం కళ్యాణదుర్గం వరకు 40కి.మీ రైల్వే మార్గం పనులు పూర్తయ్యాయన్నారు. ఆ రైలును ప్రారంభం చేయడం ఆనందంగా ఉందన్నారు. మార్చిలోగా కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు రైల్వే లైన్ పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మడకశిర వరకు 90 శాతం భూసేకరణ పూర్తయిందని, మిగిలిన పదిశాతం పూర్తయితే వచ్చే రెండేళ్లలో మడకశిర వరకు రైలు ప్రారంభం అవుతుందన్నారు.  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం మాట్లాడుతూ గుంతకల్లు నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం మీదుగా మడకశిర, బెంగుళూరుకు రైలు మార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం నుంచి విజయవాడకు రైలు నడపాలని కోరారు. అనంతరం రైల్వే శాఖామాత్యులు సురేష్‌ప్రభాకర్‌ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్‌ ద్వారా  కళ్యాణదుర్గం రైలును లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక నేతలు కూడా స్టేజీ మీద పచ్చజెండా ఊపగా నూతన మార్గంలో రైలు కళ్యాణదుర్గానికి పరుగులు తీసింది. కార్యక్రమంలో సౌత్‌వెస్ట్రన్ రైల్వే ఈఈ చంద్రశేఖర్, హుబ్లీ రైల్వే చీఫ్‌ ఇంజనీర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మోహన్, మున్సిపల్‌ చైర్మన్ రాజశేఖర్, జెడ్పీటీసీలు విజయ్‌కుమార్, పూలనాగరాజు,కౌన్సిలర్లు, రైల్వే యాక్షన్ కమిటీ సభ్యులు, ఆర్డీఓ రామారావు, తహశీల్దార్‌ ఖాతిజిన్  కుఫ్రా, ఎంపీడీఓ చిట్రా శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.       

Advertisement
Advertisement