ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

Published Sat, Jul 30 2016 10:22 PM

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

  • కేసీఆర్‌తో కలిసి ‘మిషన్‌ భగీరథ’ను ప్రారంభించనున్న నరేంద్రమోడీ
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మం‍త్రి హరీశ్‌రావు.. ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష
  • గజ్వేల్‌: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 7న మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో ‘మిషన్‌ భగీరథ’ పథకం ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగం రేయింబవళ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఆ రోజు ప్రధాని కోమటిబండ అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న ‘మిషన్‌ భగీరథ’ హెడ్‌వర్క్క్స ప్రాంగణంలో పథకం ప్రారంభసూచికగా నల్లాను ఆన్‌ చేస్తారు.

    ఆ తరువాత గుట్ట కింది భాగంలో బహిరంగ సభ జరుగనున్నది. సుమారు 2లక్షలకుపైగా జనసమీకరణ లక్ష్యంగా ఉండగా... అందుకు తగ్గట్లు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సభా స్థలిలో పూర్తిగా రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు వేయడానికి నిర్ణయించారు. ప్రధాని సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.

    అంతేగాకుండా వీవీఐపీల రాజీవ్‌ రహదారి నుంచి సింగాయపల్లి స్టేజీ, చౌదర్‌పల్లి మీదుగా కోమటిబండలోని సభాస్థలికి చేరుకునే విధంగా ఆ మార్గాన్ని కేటాయించబోతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కోసం వేర్వేరుగా హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ హెలిపాడ్‌ ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఆ శాఖ జిల్లా ఎస్‌ఈ రాధాకృష్ణ, సిద్దిపేట ఈఈ బాల్‌నర్సయ్యలు ఇక్కడే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు.

    సభావేదిక డిజైన్‌ సిద్ధం
    సభావేదిక కోసం ఇప్పటికే డిజైన్‌ సిద్ధం చేశారు. మరో రెండ్రోజుల తర్వాత సభాస్థలిని, ‘మిషన్‌ భగీరథ’ ప్రారంభోత్సవ ప్రదేశాన్ని కేంద్రానికి చెందిన ఎస్పీజీ బలగాలు ఆధీనంలోకి తీసుకునే అవకాశముంది. శనివారం ఏర్పాట్లన్నింటినీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. బహిరంగ సభాస్థలి చదును పనులను పరిశీలించారు. అంతకుముందు కోమటిబండ హెడ్‌వర్క్క్స ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లపై కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌తో చర్చించారు.

    సభావేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి, డీఐజీ అకున్‌ సబర్వాల్‌, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో 3 గంటలకుపైగా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

    ప్రధాని ముందుగా హెడ్‌వర్క్క్స ప్రాంతంలో నల్లాను ప్రారంభించిన అనంతరం సభావేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీపీసీకి చెందిన 1600 మెగావాట్ల పవర్‌స్టేషన్‌, ఎఫ్‌సీఐఎల్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌, వరంగల్‌ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేమార్గం పనులకు ప్రధాని శంకుస్థాపన ఇక్కడే చేస్తారని వెల్లడించారు. వర్షాల వల్ల సభకు అంతరాయం కలగకుండా రేయిన్‌ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రజలను ఇక్కడకు తరలిస్తామన్నారు.

Advertisement
Advertisement