అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌

Published Sun, Dec 4 2016 1:10 AM

అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌ - Sakshi

  • రూ.14 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
  •  పరారీలో సూత్రధారి, అతని తల్లి
  • నెల్లూరు (క్రైమ్‌):
    తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లాల నేరగాళ్ల ముఠాలోని ఐదుగురు సభ్యులను శుక్రవారం అర్ధరాత్రి కావలి మండలం మద్దూరుపాడు సమీపంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.14 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో శనివారం  విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ నిందితుల వివరాలను వెల్లడించారు. కావలి పుచ్చలపల్లి వారి వీధికి చెందిన సాలేటి వెంకటేశ్వర్లు పాతనేరస్తుడు. పలు దొంగతనాల కేసుల్లో జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు తన సోదరుడు లక్ష్మణ, తల్లి పార్వతి,  బోగోలు మండలం చెన్నారాయునిపాళెంకు చెందిన ఎందేటి శేషయ్య, కావలి పాతూరుకు చెందిన యద్దలపూడి సురేంద్ర,  కొత్తమసీదుకు చెందిన ప్రళయకావేరి పోలయ్య, గాయత్రినగర్‌కు చెందిన పటాన్‌ కాలేషా అలియాస్‌ గోలితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వెంకటేశ్వర్లు తనకు తెలిసిన పేపర్‌బాయిస్‌ ద్వారా తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాలను గుర్తించేవాడు. అక్కడ తన ముఠా సభ్యులతో కలిసి రెక్కీ వేసి దొంగతనాలకు పాల్పడేవాడు. నిందితులు  కొద్దిరోజులుగా కావలి మండలంలోని ముసునూరు, మద్దూరుపాడు, కావలి పట్టణం, వింజమూరు, జలదంకి, ప్రకాశం జిల్లా కందుకూరు, పామూరు, ఉలవపాడు గ్రామాల్లోని 21 ఇళ్లలో దొంగతనాలు చేశారు. బిట్రగుంట, జలదంకి, గుడ్లూరులోని దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. వీరి కదలికలపై కావలి డీఎస్పీ రాఘవరావు ఆధ్వర్యంలో కావలి సబ్‌డివిజన్‌ పోలీసులతో పాటు కందుకూరు పోలీసులు నిఘా ఉంచారు.   ఈ నేపథ్యంలో శుక్రవారం మద్దూరుపాడు సమీపంలోని హైవే వద్ద ముఠా సభ్యులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వారిపై దాడి చేశారు. ముఠాలోని ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.రెండు లక్షలు విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు సాలేటి వెంకటేశ్వర్లు, అతని తల్లి పరారీలో ఉన్నారు.  
    సిబ్బందికి అభినందన 
    నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషి చేసిన కావలి రూరల్‌ సీఐ టి.అశోక్‌వర్ధన్, ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. వెంకటరావు, కందుకూరు ఇన్‌స్పెక్టర్‌ నరసింహరావు, కలిగిరి సీఐ వెంకటరమణ, బిట్రగుంట, కావలి రూరల్, జలదంకి ఎస్‌ఐలు గిరిబాబు, పుల్లారావు, సుబ్బారావు, ఎం. ఆంజనేయులు, క్రైం సిబ్బంది ఏఎస్‌ఐ గౌస్‌బాషా, హెచ్‌సీ శ్రీనివాసులరెడ్డి, పీసీలు శ్రీనివాసులరెడ్డి, మాధవ, మస్తానయ్య, ఆయోధ్యకుమార్, హరి, రాజేష్, ఫెర్నాండేజ్, మీరాబాషా, హెచ్‌జీలు కోటేశ్వరరావు, మాల్యాద్రి, అనీల్, వెంకటరావు, ఏఆర్‌పీసీ డి, చైతలను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.  ఈ సమావేశంలో కావలి డీఎస్పీ రాఘవరావు, కావలి రూరల్‌ సీఐ అశోక్‌వర్ధన్, ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావు పాల్గొన్నారు. 
     
    .

Advertisement

తప్పక చదవండి

Advertisement