అంతర్‌ జిల్లాల దొంగ అరెస్టు | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లాల దొంగ అరెస్టు

Published Thu, Jun 1 2017 11:35 PM

inter stater thief arrest

గుంతకల్లు : జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు అంతర్‌ జిల్లాల దొంగగా మారాడు. చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో మంచీ,  చెడ్డా చెప్పే వారు లేక 16 ఏళ్ల వయస్సులోనే హత్య కేసులో నిందితుడిగా పోలీసుల రికార్డుకెక్కాడు. అంతటితో ఆగక అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. గుంతకల్లు టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ ఆవరణలో అర్బన్‌ సీఐ రాజు, ఎస్‌ఐలు నగేష్‌బాబు(వన్‌టౌన్‌), వలీబాషా(టూటౌన్‌)తో కలసి డీఎస్పీ రవికుమార్‌ మీడియా ముందు నిందితుడ్ని గురువారం హాజరుపరిచారు. ఆయన కథనం మేరకు...

అనుమానాస్పదంగా తిరుగుతూ...
గుంతకల్లులోని బీరప్పగుడి సర్కిల్‌లో ఇనుపరాడ్‌తో అనుమానాస్పదంగా తిరుగాడుతున్న యువకుడి గురించి స్థానికులు అర్బన్‌ సీఐ రాజుకు సమాచారం తెలిపారు. ఆయన ఎస్‌ఐలు, సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లి పట్టుకుని విచారించారు. విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన శ్రీకాంత్‌(22)గా గుర్తించారు.  జల్సాల కోసమే దొంగతనాలు చేస్తుంటానని విచారణలో అంగీకరించాడు.  

ఎక్కడెక్కడ చోరీలు చేశాడంటే...
- గుంతకల్లులోని పద్మావతి నర్సింగ్‌ హోం ఏరియాలో 2016 జులైలో సుల్తాన్‌ నూర్‌ అహ్మద్‌ ఇంట్లో పట్టపగలు దొంగతనం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు.
- మహబూబ్‌నగర్‌ కాలనీలోని నేసే నారాయణ, లక్ష్మీ దంపతుల ఇంట్లో చొరబడి బంగారు ఆభరణాలు అపహరించాడు.
- కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో శ్రీరాములుగౌడ్‌ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశాడు.
- దొంగలించిన బంగారు ఆభరణాలను కర్ణాటకలోని బళ్లారి రాష్ట్రంలో విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సా చేసేవాడు. నిందితుడి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 16.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. బళ్లారి రాష్ట్రంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదువ(తాకట్టు) పెట్టిన 2 తులాల బంగారు ఆభరణాలూ రికవరీ చేశామన్నారు.
- పాతగుంతకల్లు అంకాలమ్మ లాలయ సమీపంలో గతంలో జరిగిన హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు.
- నిందితుడుపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. ఏఎస్‌ఐ తిరుపాల్, హెడ్‌ కానిస్టేబుళ్లు రామకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మధు, సిద్దయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement