ఐపీ..కుచ్చుటోపీ..! | Sakshi
Sakshi News home page

ఐపీ..కుచ్చుటోపీ..!

Published Thu, Sep 15 2016 11:38 PM

వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధిత రైతులు

  • రూ.4.54 కోట్లకు వ్యాపారి టోకరా
  • 158మంది రైతుల కంట్లో ‘మిర్చి’ కొట్టిన దివాలా
  •  
    ఏన్కూరు{ ఆరుగాలం శ్రమించి..చెమటోడ్చి పండించిన పంటను వ్యాపారి చేతిలో పెడితే..రావాల్సిన డబ్బును ఇగిస్తా..అగిస్తా.. అంటూ చివరకు రైతుల కంట్లో ‘మిర్చి’ కొట్టిండో వ్యాపారి. సన్న, చిన్నకారు రైతులెందరో అమ్మిన మిరప దిగుబడి డబ్బులొస్తాయని ఆశగా చూస్తుంటే..దివాలా పిటీషన్‌ వేయడంతో గుండెపగిలినంత పనై..రోదిస్తున్నారు. కొందరికి రూ.వేలు, ఇంకొందరికి రూ.లక్షలు ఇలా..158మంది రైతులకు అక్షరాలా..రూ.4 కోట్లకు పైగా ముట్టజెప్పాల్సి ఉండగా..ఐపీ..పేరిట కుచ్చుటోపీ పెట్టాడని ఆవేదన చెందుతున్నారు. ఇక తమ పరిస్థేతేం కావాలని కర్షకులు ఆక్రోశిస్తూ..అధికారులే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 
     
    • 158మంది బాధిత రైతులు..
    • రావాల్సింది కోట్ల రూపాయలు..
    ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన ఇంజం గోవర్దన్‌ అనే వ్యాపారి రైతుల నుంచి మిరప పంటను కొనుగోలు చేసి..వారికి డబ్బు చెల్లించకుండా జాప్యం చేస్తూ చివరకు వ్యాపారంలో నష్టపోయానని పేర్కొంటూ దివాలా పిటీషన్‌ (ఐపీ) వేశాడు. ఇతను ఏన్కూరు మండలంలోని  రేపల్లెవాడ, కేసుపల్లి, హిమామ్‌నగర్, టీఎల్‌.పేట, అక్కినాపురంతండా, రామాతండా, భద్రుతండా, భగవాన్‌నాయక్‌తండా, తదితర గ్రామాల్లో రైతుల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో మిరపకాయలను కొనుగోలు చేశాడు. మొత్తం 158 మంది రైతుల వద్ద నుంచి సరుకు కొనగా..ఇందుకు సంబంధించిన చెల్లింపులు జరగలేదు. ఒక్కో రైతుకు రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు అందజేయాల్సి ఉంది. ఒక్క రేపల్లెవాడ గ్రామానికి చెందిన 46 మంది రైతులకే సుమారు రూ.65 లక్షలు రావాల్సి ఉంది. ఇంకా..సన్న, చిన్నకారు రైతులకు కూడా ఒక్కోక్కరికి వేలల్లో డబ్బు ఆగింది. 
    • రేపు రా..మాపు రా..
    • చివరకు ముంచెరా..!
    పంట డబ్బుకోసం సదరు వ్యాపారి ఇంటి చుట్టూ తిరగలేక అవస్థ పడ్డామని, ఎప్పుడు వెళ్లినా..రేపిస్తా..మాపిస్తా..అంటూ తిప్పి తిప్పలు పెట్టాడని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా 5, 15, 25వ తేదీన డబ్బులిస్తానని మాయమాటలు చెప్పి కాలం వెల్లబుచ్చాడని అంటున్నారు. ఇంటికి పోతే అక్కడా ఉండడని, భార్యను అడిగితే ఎక్కడికి వెళ్లిండో తెలియదని చెప్పేదని, ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చేదని..కష్టపడి పంట పండించి అమ్మితే..ఈ గోసేందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    • వ్యాపారిపై ఫిర్యాదులు..
    • ఆదుకోవాలని విన్నపాలు..
    – ఐపీ పెట్టిన వ్యాపారి ఇంజం గోవర్దన్‌పై చర్యలు తీసుకోవాలని ఏన్కూరు పోలీస్‌ స్టేషన్‌లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. 
    – కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట నాగరాజు తెలిపారు. 
    – తమకు రావాల్సిన డబ్బును చెల్లించేలా చూడాలని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ నాగరాజును రైతులు వేడుకున్నారు. 
    – అనంతరం బాధిత రైతులు కలెక్టర్‌ను కలిసేందుకు లారీలో ఖమ్మం వెళ్లారు.
    • నమ్మించి ముంచిండు..
    మూడెకరాల్లో మిర్చి వేసి..వ్యాపారి గోవర్దన్‌కు అమ్మినా. 26 క్వింటాళ్ల మిర్చికి రూ.3 లక్షలకు పైగా రావాల్సి ఉంది. ఆరు నెలల నుంచి తిప్పుకొని..ఇప్పుడు ఐపీ పెట్టిండు. 
    – కె.నరసింహారావు, బాధిత రైతు, రేపల్లెవాడ.
    • ఆ వ్యాపారిని శిక్షించాలి..
    రైతులను మోసి చేసి ఐపీ దాఖలు చేసిన వ్యాపారిని కఠినంగా శిక్షించాలి. నాకు రూ.2.50 లక్షలు ఇవ్వాల్సి ఉంని. ఆ డబ్బు చెల్లించాలి. నాకు న్యాయం జరిగేలా చూడాలి.
    –ఎస్‌కె.ఖాసీంసాహెబ్, బాధిత రైతు, టీఎల్‌.పేట

Advertisement

తప్పక చదవండి

Advertisement