ఉద్యమకారులపై కేసులు సరికాదు | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులపై కేసులు సరికాదు

Published Fri, Aug 26 2016 10:39 PM

ఉద్యమకారులపై కేసులు సరికాదు - Sakshi

దోమకొండ : జిల్లాలు, మండలాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన దోమకొండ మండలం బీబీపేటలో మండల సాధన కోసం చేస్తున్న రిలేదీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజల అభీష్టం మేరకే మండలాల ఏర్పాటు జరుగుతుందని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారన్నారు. అలాంటి సమయంలో బీబీపేట మండలం కోసం ఉద్యమించిన 35 మందిపై కేసులు పెట్టారని, వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై తాను పోలీసు అధికారులతో మాట్లాడుతానన్నారు. గతంలో గ్రామాల్లో బెల్లం పండించి బతికే వారని, ప్రస్తుతం సారా పేరుతో పాలకులు బెల్లం నిషేధించారని విమర్శించారు. కామారెడ్డి ప్రాంతంలో బెల్లం వండిన రైతులు బెల్లం ముద్దలు అమ్ముకుని పండుగలు, శుభకార్యాలు చేశారని ఆయన గుర్తుచేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం కొరత ఏర్పడిందన్నారు. ప్రజల అభిప్రాయాలు మేరకు మండలాలు, జిల్లాల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 
 

Advertisement
Advertisement