బోయకొండ ఆర్థిక లావాదేవీలపై ఐటీ కన్నెర్ర | Sakshi
Sakshi News home page

బోయకొండ ఆర్థిక లావాదేవీలపై ఐటీ కన్నెర్ర

Published Wed, Aug 10 2016 10:24 PM

చౌడేపల్లె మండలం బోయకొండ ఆలయం.

 
– 14 ఖాతాలు స్తంభింపజేస్తూ ఉత్తర్వులు
– స్తంభించిన పాలన
పుంగనూరు :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయానికి చెందిన బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై ఆదాయపు పన్ను (ఐటీ)శాఖ కన్నెర్ర చేసింది. పన్నులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ బోయకొండ ఆలయానికి చెందిన 14 బ్యాంకుల ఖాతాలను స్తంభింప చేస్తూ ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. దీని కారణంగా బోయకొండ ఆలయంలో పాలన స్తంభించింది. నిత్య పూజలకు అవసరమైన డబ్బులకు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. బోయకొండ గంగమ్మ ఆలయ ఆర్థిక లావాదేవీలపై ప్రతియేటా ఆదాయపు పన్నుశాఖకు నివేదికలు పంపేవారు. ఇలా ఉండగా 2012 సంవత్సరం నుంచి ఆర్థిక లావాదేవీలను పంపకపోవడంతో ఐటీ అధికారులు రూ.23.80 లక్షలు పన్ను చెల్లించాలని బోయకొండ ఆలయానికి నోటీసులు జారీచేశారు. దీనిపై బోయకొండ ఈవో ఏకాంబరం ఐటీ అధికారులపై ఉన్నతాధికారులకు జూన్‌లో అప్పీలుచేశారు. దీనిపై ఐటీ శాఖ 15 శాతం పన్ను డిపాజిట్‌ చేస్తే స్టే ఉత్తర్వులు జారీచేస్తామని, లేకపోతే రూ.23.80 లక్షలు కట్టాల్సిందేనని తెలిపారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సకాలంలో స్పందించకపోవడంతో స్థానిక అధికారులు ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు. దీనిపై ఐటీ శాఖ పలుమార్లు ఆలయ ఈవోకు నోటీసులు జారీచేసింది. స్పందన లేకపోవడంతో బోయకొండకు చెందిన 14  బ్యాంకుల్లోని ఖాతాలను స్తంభింప చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం
బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిన మాట వాస్తవమే. 2012 సంవత్సరంలో రూ.23.80 లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో అప్పీలుచేశాం. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. భక్తులకు, ఆలయంలో నిత్యపూజలకు ఎలాంటి సమస్య ఉండదు. ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాం.
– ఏకాంబరం, కార్యనిర్వహణాధికారి, బోయకొండ ఆలయం
 
 

Advertisement
Advertisement