జనం కావాలా.. ఆ ఇద్దరూ కావాలా | Sakshi
Sakshi News home page

జనం కావాలా.. ఆ ఇద్దరూ కావాలా

Published Tue, Nov 1 2016 11:55 PM

జనం కావాలా.. ఆ ఇద్దరూ కావాలా - Sakshi

సీఎం చంద్రబాబు తేల్చుకోవాలి
 జైలునుంచి విడుదలైన ఆక్వాపార్క్‌ ఉద్యమ నేతల అల్టిమేటం
నరసాపురం :
’నేను ఏం నేరం చేశానని 50 రోజులు జైల్లో పెట్టించావు. మహిళనని కూడా చూడకుండా హత్యాయత్నం కేసు పెట్టించావు. ఆక్వా పార్క్‌ కడితే మా ఆరోగ్యాలు పాడవుతాయి. పొలాలు నాశనమవుతాయి. అందుకే ఫ్యాక్టరీ కట్టొద్దని వేడుకుంటే పోలీసులతో దమనకాండ సాగించావు. నీకు ఓట్లేసి గెలిపించినందుకు ఆడవాళ్ల ఉసురుపోసుకుంటావా. నీకు జనం కావాలా లేక ఫ్యాక్టరీ కట్టిస్తున్న ఆ ఇద్దరూ కావాలా.. తేల్చుకో చంద్రబాబూ’ అని తుందుర్రు ఆక్వాపార్క్‌ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతి అల్టిమేటం ఇచ్చారు. నరసాపురం సబ్‌జైలులో 51 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న ఆరుగురు ఉద్యమకారులు మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. వారికి స్వాగతం పలికేందుకు నరసాపురం వచ్చిన సత్యవతి ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడారు. ’మాకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అండగా నిలబడ్డారు. లేదంటే నీ పోలీస్‌ బాబులు, ఫ్యాక్టరీ యాజమాన్యం కలసి మరిన్ని దాష్టీకాలు చేసేవారు’ అని ఆమె అన్నారు. ’మేం ఏం నేరం చేశాం. ఫ్యాక్టరీ వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని, మా ఉద్యమానికి అండగా నిలబడమని అడిగేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్‌ను కలవడం మేం చేసిన తప్పా. కాలుష్య కారకమైన ఫ్యాక్టరీ కట్టొద్దని వేడుకోవడం తప్పా’ అని ప్రశ్నించారు. ఓట్లేసిన జనం కావాలో, ఆక్వాపార్క్‌ పారిశ్రామిక వేత్తలు కావాలో చంద్రబాబు తేల్చుకోవాలన్నారు. జైలులో ఉన్న తనను కలిసిన వైఎస్‌ జగన్‌ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకుండా చూద్దామని మాట ఇచ్చారని అన్నారు. ఆక్వాపార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంటామని, ఎట్టిపరిస్థితుల్లో పోరాటం ఆపేది లేదని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పోరాట కమిటీ కన్వీనర్‌ ఆరేటి వాసు మాట్లాడుతూ ’మా అమ్మను అరెస్ట్‌ చేశారు. నాన్న క్యాన్సర్‌ పేషెంట్‌ కనికరించమన్నా పట్టించుకోలేదు. మేం రౌడీలు, గూండాలమా’ అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో ఇక్కడ ప్రజల కడుపులపై కొడితే సహించేది లేదన్నారు.
 
ఘన స్వాగతం
నరసాపురం సబ్‌జైలులో 51 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి వాసు, బెల్లపు  సుబ్రహ్మణ్యం, సముద్రాల వెంకటేశ్వర్లు, కర్రి మాచర్రావు, కొయ్యే మహేష్‌ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో మంగళవారం విడుదలయ్యారు. వీరంతా జైలునుంచి బయటకు రాగానే.. అప్పటికే అక్కడకు చేరుకున్న భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని ఆక్వాపార్క్‌ ప్రభావిత గ్రామాల ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు సబ్‌జైలు వద్దకు చేరుకున్నారు. తమకోసం పోరాడిన ఉద్యమకారులు బయటకు రాగానే పూలు చల్లి స్వాగతం చెప్పారు. భుజాలపై ఎత్తుకుని జైకొట్టారు. వ్యాన్‌ ఎక్కించి ఊరేగించారు. స్టీమర్‌రోడ్డు, అంబేడ్కర్‌ సెంటర్‌ మీదుగా తుందుర్రు వరకూ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత ఆర్‌ఎస్‌ రాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, సీపీఎం ముఖ్యనేతలు మంతెన సీతారామ్, బి.బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
Advertisement