ఆ బుక్ ఉంటే చాలంటున్నారు పోలీసులు! | Sakshi
Sakshi News home page

ఆ బుక్ ఉంటే చాలంటున్నారు పోలీసులు!

Published Sun, Aug 14 2016 10:07 PM

ఆ బుక్ ఉంటే చాలంటున్నారు పోలీసులు! - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మహిళలు, యువతులతో పాటు బాధితులకు సత్వరం సహాయం అందించడం, ప్రజలకు–పోలీసులకు మధ్య సమాచార మార్పిడికి ప్లాట్‌ఫాంగా ఉపకరించడం కోసం నగర పోలీసు విభాగం రూపొందించిన మొబైల్‌ యాప్‌ ‘హాక్‌–ఐ’కి అక్షర రూపం ఇచ్చారు. దీని వినియోగం, ఉపయోగాలను అన్ని స్థాయిల ప్రజల్లోకీ తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించారు. నగర పోలీసు ఐటీ సెల్‌ రూపొందించిన వీటిని నగర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలతో పాటు అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేందుకు  సన్నాహాలు చేస్తున్నారు.

ఆపదలో ఉన్నా, కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా, పోలీసులకు సంబంధించిన సమాచారం కావాలన్నా, వారికి ఫిర్యాదు చేయాలన్నా ఉపకరించేలా ‘హాక్‌–ఐ’ రూపొందింది. అత్యవసర సమయాల్లో సహాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన వర్చువల్‌ బటన్‌ ‘ఎస్‌ఓఎస్‌’ ద్వారా బాధితుల లోకేషన్‌ తెలుసుకునే సౌకర్యం ఏర్పాటు చేసింది. మరోపక్క ఈ యాప్‌ ద్వారా ‘డయల్‌–100’కు కాల్‌ చేసినా ఇది వర్తించేలా అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను ఇప్పటి వరకు రెండు లక్షల మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘హాక్‌–ఐ’పై అవగాహన పెంచితే ప్రజలకు మరితం ఉపయుక్తంగా ఉంటుందని సిటీ పోలీసులు నిర్ణయించారు.

ప్రతి అంశం సవివరంగా...
‘హాక్‌–ఐ’ యాప్‌కు సంబంధించిన అన్ని అంశాలు అందరికీ అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రూపొందించారు.  దీన్ని ఇన్‌స్టల్‌ చేసుకోవడం నుంచి అందులో ఉండే ఒక్కో విభాగం, వాటిని వినియోగించుకోవడం తదితరాలను పూర్తిస్థాయిలో వివరించారు. అన్ని స్థాయిల వారికీ అర్థమయ్యేలా కేవలం ఆయా అంశాలపై వివరణ ఇవ్వడం మాత్రమే కాకుండా చిత్రాలు, ఫొటోలు, గ్రాఫ్‌ల రూపంలో అందించారు. ఈ యాప్‌ను ఇంత వరకు ఎంత మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు, ఎంత మంది ఎన్ని రకాలుగా వినియోగించుకుని సహాయసహకారాలు పొందారు అనే వివరాలతో పాటు కొన్ని కీలకమైన కేస్‌స్టడీస్‌ను సైతం ఈ పుస్తకంలో పొందుపరిచారు.

‘పోలీసు’ నుంచి ప్రజల వరకు...
ప్రస్తుతం ఇంగ్లీషు భాషలో రూపొందించిన ఈ పుస్తకాలను భవిష్యత్తులో తెలుగు, ఉర్దూ భాషల్లోనూ అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. వీటిని ప్రాథమికంగా పోలీసుస్టేషన్లు, గస్తీ నిర్వహించే రక్షక్‌ వాహనాల్లో ఉంచుతున్నారు. స్థానికంగా గస్తీ నిర్వహించే పోలీసులు అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లి ఈ పుస్తకాలతో పాటు కొన్ని కరపత్రాల ద్వారా యాప్‌పై అవగాహన కల్పిస్తారు. ఠాణాల్లోని రిసెప్షన్లతో పాటు కళాశాలలు, పాఠశాలలు, హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్, ప్రభుత్వ–ప్రైవేటు కార్యాలయాలకు ఈ పుస్తకాలు పంపిణీ చేస్తారు. వీటి నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉంచే బాధ్యతల్ని ఆయా యాజమాన్యాలకే అప్పగించినా స్థానిక పోలీసులు నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.

 

Advertisement
Advertisement