ఇది ‘అనంత’కు దక్కిన గౌరవం | Sakshi
Sakshi News home page

ఇది ‘అనంత’కు దక్కిన గౌరవం

Published Wed, Aug 10 2016 1:15 AM

ఇది ‘అనంత’కు దక్కిన గౌరవం - Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు
 
అనంతపురం సెంట్రల్‌ : స్వాతంత్య్ర దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం అనంతపురం జిల్లాకు దక్కిన గౌరవమని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. వేడకలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు వివరించారు. స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానంలో జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు, శాంతి భద్రతల విషయంలో తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన ఇలా వివరించారు.                                  
 
సాక్షి : ఆగస్టు 15 వేడుకలకు ఇక ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి?
ఎస్పీ : స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లపై నిరంతర పరిశీలన ఉంటోంది. పోలీస్‌ ఉన్నతాధికారులు అక్కడే ఉంటూ ప్రతి పనినీ పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి చేసి స్టేడియంను అప్పగిస్తారు. 
సాక్షి : రాష్ట్రస్థాయి వేడుకలకు వచ్చే వీవీఐపీలకు ఎక్కడ ఆతిథ్యం కల్పిస్తున్నారు? 
ఎస్పీ: వీవీఐపీలందరూ ఒకరోజు ముందే జిల్లాకు వచ్చే అవకాశముంది. వారందరికీ ఆతిథ్యం ఇచ్చే బాధ్యత రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. ప్రభుత్వ అతిథి గృహాలు, పీటీసీలోని గెస్ట్‌ హౌస్‌లు, నగరంలోని ముఖ్యమైన లాడ్జిలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. 
సాక్షి : భద్రత విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: స్టేడియంపై నిఘా పటిష్టం చేశాం. ముఖ్యమంత్రితో పాటు, వీవీఐపీలు ఏఏ గేట్ల గుండా మైదానంలోకి రావాలి అనే అంశంపై ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ తయారు చేశాం. సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై జిల్లా కేంద్రంలోకి వచ్చే వారిపై నిఘా పెంచుతాం. వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశిస్తున్నాం. మైదానం చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలపై కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించి వివరాలు సేకరిస్తాం. అలాగే నగరంలో దాదాపు 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.  
సాక్షి : కృష్ణా పుష్కరాలకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లాయి. రాష్ట్రస్థాయి వేడుకలు జరుగుతున్న సమయంలో బలగాలు లేకపోతే ఎలా?
ఎస్పీ: స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి భద్రత విషయంలో ఎలాంటి ఢోకా లేదు. అయినప్పటికీ మరికొంత బలగాలను రాయలసీమ జిల్లాల నుంచి పంపాలని ఐజీని కోరుతున్నాం. వేడుకల రోజున దాదాపు 1,500 మందికి పైగా బందోబస్తులో పాల్గొంటారు.  

Advertisement
Advertisement