సరైన వైద్యం అందక తల్లీ, బిడ్డ మృతి | Sakshi
Sakshi News home page

సరైన వైద్యం అందక తల్లీ, బిడ్డ మృతి

Published Fri, Nov 18 2016 10:28 PM

సరైన వైద్యం అందక తల్లీ, బిడ్డ మృతి

రైల్వేకోడూరు రూరల్‌: రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీలో 2వ ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న కొత్తపల్లి శ్రీలక్ష్మి(28), కుమారుడు(శిశువు) గురువారం అర్థరాత్రి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మృతురాలు రైల్వేకోడూరు పట్టణంలోని న్యూకృష్ణానగర్‌కు చెందిన సావిత్రి, సుబ్బరాయుడుల సంతానం. ఈమెను చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర సదుం గ్రామానికి చెందిన వెంకట రమణకు ఇచ్చి వివాహం చేశారు. వారికి మొదటి సంతానం రెండున్నర సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చింది. నెలలు నిండినా డెలివరీ కాకపోవడంతో గురువారం రాత్రి రైల్వేకోడూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరింది. 

వైద్యులు పరీక్షించి తల్లీ, బిడ్డ పల్స్‌ బాగున్నాయని చెప్పారు. ఆ తర్వాత డెలివరీ అయ్యేందుకు ఇంజక్షన్‌ వేశారు. అర్ధరాత్రి సమయంలో పరీక్షించగా బిడ్డ పల్స్‌ తగ్గినట్లు గుర్తించారు. ఇక్కడ వసతులు లేవని చెప్పితిరుపతికి రెఫర్‌ చేశారు. అర్ధరాత్రి సమయం కావడంతో 108 కూడా అందుబాటులో లేదు. 40 నిమిషాల తర్వాత ఓ వాహనం తీసుకుని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్‌ పరీక్షించగా అప్పటికే శిశువు మృతి చెందిందని, శిశువును బయటకు తీశారు. హైరిస్క్‌ కేసు అని, త్వరగా తిరుపతికి వెళ్లాలని సూచించారు. వెంటనే తిరుపతికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని సదుంకు మృతదేహాన్ని తీసుకెళ్లి దహనసంస్కారాలు చేశారు. వైద్యాధికారులు, సిబ్బంది వెళ్లి ఆమెకు నివాళులర్పించారు. ఏఎన్‌ఎంగా పని చేస్తూ చనిపోవడంపై పలువురు దిగ్భ్రాంతి చెందారు.

Advertisement
Advertisement