ఆపదవేళ.. ఆప్తబంధువులా.. | Sakshi
Sakshi News home page

ఆపదవేళ.. ఆప్తబంధువులా..

Published Sun, Jul 2 2017 12:17 AM

ఆపదవేళ.. ఆప్తబంధువులా.. - Sakshi

- చాపరాయి బాధితులను పరామర్శించిన జగన్‌
- గిరిజనుల్లో భరోసా నింపిన వైఎస్సార్‌ సీపీ అధినేత
- అభయారణ్యం, ప్రమాదకర ఘాట్‌లో 70 కిలోమీటర్లు సాగిన ప్రయాణం
సాక్షి, రాజమహేంద్రవరం : ఎవరిని కదిపినా కన్నీళ్లే. ఏ ఒక్కరిని పలుకరించినా కష్టాలే. తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తలచుకొని ఆ అడవి బిడ్డలు కొండలు ప్రతిధ్వనించేలా రోదిస్తున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన అభాగ్యులు.. తల్లీబిడ్డలను కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న బాధితులు.. ఇలా ఒకరేమిటి? అనేకమంది బాధిత గిరిజనుల కన్నీళ్లు తుడిచే సదాశయంతో వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏజెన్సీలో పర్యటించారు. బాధిత గిరిజన కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఎంత కష్టమైనా వెనుకాడలేదు. దట్టమైన అభయారణ్యంలో.. ఘాట్‌ రోడ్డు మీదుగా.. సాహసోపేతంగా పయనించి గిరిజనుల చెంతకు వెళ్లారు. కొండంత కష్టాల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆదుకుంటానని చెప్పి కొండంత ధైర్యం ఇచ్చారు.
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి బాధితులను శనివారం ఉదయం పరామర్శించిన జగన్‌.. అనంతరం మారేడుమిల్లి మీదుగా చాపరాయి గ్రామానికి వెళ్లారు. మారేడుమిల్లి నుంచి దట్టమైన అడవి, ఘాట్‌ రోడ్డులో ప్రయాణించి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ గ్రామానికి చేరుకున్నారు. మార్గం మధ్యలోని గ్రామాల్లో తనకోసం ఎదురు చూస్తున్న గిరిజనుల సమస్యలు వింటూ, వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ తన పయనం సాగించారు. ఆకుమామిడికోట, బొడ్డుమానివీధి, విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం బొడుగుమామిడి, పోతవరం, రంపచోడవరం నియోజకవర్గం దారగడ్డ, యొడ్లకొండ గ్రామాల్లో తనకోసం రోడ్డుపైకి వచ్చిన గిరిజనులు చూసిన ఆగిన జగన్‌.. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ఆయా గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువకులు తమ సమస్యలను జగన్‌కు మొర పెట్టుకున్నారు. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. తాగడానికి కనీసం గుక్కెడు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వాగుల్లో నీరు తాగుతున్నామని, స్నానానికి వర్షపు నీటిని వాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఆస్పత్రికి వెళదామన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బోరుమన్నారు. నీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయని వాపోయారు. పాకల్లో ఉంటున్న తమకు ప్రభుత్వం తమకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. 70 ఏళ్లు వచ్చినా పింఛన్‌ ఇవ్వడం లేదని వాపోయారు.
మాకు మీరే దిక్కు
‘‘ఇవే సమస్యలతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు మంచినీరు, తిండి, రోడ్లు వేయించండి. మీరే మాకు దిక్కు. మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి’’ అంటూ ఆయా గ్రామాల గిరిజనులు జగన్‌కు విన్నవించారు. వారి కష్టాలను, సమస్యలను సావధానంగా విన్న జగన్‌.. అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని చెప్పారు. తోలు మందం చంద్రబాబుకు సమస్యలు చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అయినా విడవకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేద్దామని భరోసా ఇచ్చారు. స్థానికంగా పరిష్కారమయ్యే పింఛన్లు, రేషన్‌ కార్డులవంటి వాటిని పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరిలకు సూచించారు. ఆయా గ్రామాల ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను తీసుకున్నారు. ప్రతిపక్షంగా సమస్యల పరిష్కారంపై పోరాడదామని, మన ప్రభుత్వం వచ్చాక అందిరికీ మంచి చేస్తామని హామీ ఇచ్చారు.
చేయి ఇచ్చి నడిపించిన గిరిజనులు
గ్రామాల్లో వాగులు, వంకలు దాటేందుకు స్థానిక గిరిజనులు జగన్‌కు సహాయం చేశారు. తమ చేతిని అందించి జగన్‌ను తమ ఊరి నుంచి సాగనంపారు. కటారికోట గ్రామంలో కర్రెల వంతెనను ఓ మహిళ జగన్‌ చేయిపట్టుకుని దాటించింది. కటారికోట దాటిన తర్వాత చాపరాయి గ్రామానికి మధ్య ఏడు కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వాహనాలు కొండలు ఎక్కలేకపోయాయి. జగన్‌ కాన్వాయ్‌లో సెక్యూరిటీ వాహనాలు చాపరాయికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. స్థానికంగా సమకూర్చిన వాహనంలో జగన్‌ చాపరాయి గ్రామం వెళ్లారు. వాగులు, వంకలు దాటి గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జగన్‌ పర్యటనతో ఏజెన్సీ ప్రజల మోముల్లో తమ సమస్యలు ఇకనైనా తీరతాయన్న ఆనందం కనిపించింది. ఒక్కొక్కరి తలపై నిమురుతూ వారిని ఆప్యాయంగా పలుకరించడంతో ఆయా గ్రామాల్లో గిరిజనులు ఆనందంతో కంటతడిపెట్టారు.
సీతమ్మ కొడుకు వైఎస్‌ జగన్‌
చాపరాయి గ్రామానికి వచ్చిన వై.రామవరం మండలం బొడ్డగండి నుంచి సీతమ్మ అనే వృద్ధురాలు వచ్చింది. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన సీతమ్మ.. చాపరాయి గ్రామంలో తమ పంచాయతీ సమస్యలను చెప్పుకొంది. జగన్‌తో ఆమె మాట్లాడుతూ ‘‘మా ఊరిలో తాగడానికి నీరు లేదు. రోడ్లు లేవు. ఎవ్వరూ పట్టించుకోవడంలేదు’’ అంటూ తమ సమస్యలు పరిష్కరించేందుకు సీతమ్మ కొడుకు వైఎస్‌ జగన్‌ వచ్చాడని ఆనందం వ్యక్తం చేసింది. ‘‘మాకు నీవే దిక్కు కొడుకా.. ఏమి చేస్తవో’’ అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. సీతమ్మ కొడుకు జగన్‌ అని ఆమె అనగానే అక్కడ ఉన్న గిరిజనులు చప్పట్లతో హోరెత్తించారు.

Advertisement
Advertisement