నిలదీతలు.. నిరసనలు.. | Sakshi
Sakshi News home page

నిలదీతలు.. నిరసనలు..

Published Wed, Jan 4 2017 11:50 PM

నిలదీతలు.. నిరసనలు..

‘జన్మభూమి’లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తప్పని సెగ
జనం ప్రశ్నలకు జవాబివ్వలేక సభల నుంచి నిష్క్రమణ
కొన్ని చోట్ల తూతూమంత్రంగానే కార్యక్రమం నిర్వహణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :నాలుగో విడత జన్మభూమి గ్రామసభలు అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.  ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలాయనమంత్రం పఠిస్తున్నారు. కొన్ని సభల్లో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అధికారపార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భర్తలు పెత్తనం చెలాయిస్తున్న తీరుతో విస్తుపోవడం అధికారుల వంతవుతోంది. కొందరు ఎమ్మెల్యేలైతే నిలదీసే జనాన్ని సమాధానపరచలేక, సొంత పార్టీ నేతల మధ్య అంతర్గత పోరుతో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించ లేక ప్రతిపక్షంపై అవాకులుచెవాకులు పేలుతూ సభలను మమ అనిపించేస్తున్నారు. రాజానగరంలో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామభలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనిపెళ్ళ సత్తిబాబు ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నవారికి జీఓ 270 ప్రకారం నామమాత్రపు ధరకు ఇవ్వాలని కోరారు.  సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తగు విధంగా స్పందించకపోవడంతో స్థానికులు మీ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే అమలు చేయమంటున్నామని నిలదీశారు. అధికారులతో మాట్లాడి చెపుతానంటూ ఎమ్మెల్యే వెళ్లి పోబోగా  అడ్డగించిన జనం రెండున్నరేళ్లయినా ఇళ్ల పట్టా హామీ అమలు చేయలేదని నిలదీశారు. ‘మరో రెండేళ్లు ఉంటాను. అప్పుడు చూద్దా’మంటూ ఎమ్మెల్యే నిష్క్రమించారు. 
‘సాక్షి’పై అయితాబత్తుల అక్కసు
అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం గోపవరం జన్మభూమిలో అక్కడి అధికారపారీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు జన్మభూమిలో వచ్చిన సమస్యల పరిష్కారం కంటే మంగళవారం సన్నవిల్లిలో జరిగిన వివాదాన్ని ప్రజల ముందుంచిన ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కేందుకే ప్రాధాన్యమిచ్చారు.ఇది చూసి విస్తుపోవడం జనం వంతైంది. సహనం కోల్పోయి తిట్లపురాణం అందుకున్న ఎమ్మెల్యే ‘సాక్షి’లో ప్రచురితమైన సన్నవిల్లి, నంగవరం గ్రామాల నేతల మధ్య వివాదాన్ని చివరకు రాజీ చేయడం కొసమెరుపు.
ముమ్మిడివరంలో పార్టీ సభలా..
ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాత ఇంజరం జన్మభూమి గ్రామ సభకు అక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హాజరు కాలేదు. ఆయన స్థానే అధికారపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద హాజరవడమే కాక ఆధ్వర్యం కూడా వహించడం ద్వారా జన్మభూమి సభను టీడీపీ సభగా మార్చేశారు. పింఛన్లు, రేషన్‌కార్డులు అనర్హులకు కేటాయించడంపై స్థానికులు సభను అడ్డుకుని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జన్మభూమి నిర్వహించడమేమిటని జనం ముక్కున వేలేసుకున్నారు. చివరకు రేషన్‌కార్డులు ఇవ్వకుండానే అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. దాదాపు ఇదే పరిస్థితి ఏజెన్సీలోని చింతూరు మండలం మోతుగూడెం జన్మభూమి సభలో కనిపించింది. అక్కడ జన్మభూమి కమిటీ సభ్యులు వేదిక అలంకరించడంపై సర్పంచ్‌ ఆకేటి సీత ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, టీడీపీ కార్యక్రమమా అని నిరసన తెలియచేసి జెడ్పీటీసీ సోయం అరుణతో కలసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఐటీడీఏ పీవో చినబాబు వారిని సముదాయించి జన్మభూమి కమిటీ సభ్యులను వేదికకు దూరంగా కూర్చోబెట్టడంతో కార్యక్రమం కొనసాగింది. 
పోలీసుల పహరా మధ్య..
ఎటపాక మండలం చోడవరం, రాయనపేట పంచాయతీల్లో  గ్రామసభలు పోలీసుల పహరా నడుమ నిర్వహించారు. స్థానికులు సమస్యలపై నిలదీస్తారని పోలీసులు మోహరించారు. అనుకున్నట్టే గత జన్మభూమి సమస్యలు పరిష్కరించక పోవడంపై స్థానికులు నిలదీశారు. కూనవరం మండలం కరకగూడెంలో అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు మంజూరు కాలేదని, ఏడాది క్రితం దరఖాస్తు చేసినా రేషన్‌కార్డులు ఇవ్వకపోవడంపై అధికారులను నిలదీశారు. రాజవొమ్మంగి మండలం వంతంగిలో జన్మభూమిని వాల్మీకిలు అడ్డుకున్నారు.  గతంలో ఇచ్చే కులధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్టీలు కాదంటూ వారికి ఎల్‌ఈడీ బల్బులు కూడా ఇవ్వని విషయం ప్రస్తావించి నిలదీశారు. తహసీల్దార్‌ పద్మావతి, అధికారులను ఊరి పొలిమేరలోనే గిరిజనులు ఆపేశారు.  ట్రాక్టర్, మోటారు సైకిళ్లు అడ్డుపెట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఈ రకంగా ప్రతి జన్మభూమిసభలో ప్రజాగ్రహంతో అధికారపార్టీకి చెమటలు పడుతున్నాయి.
 
 

Advertisement
Advertisement