జయహో జనగామ | Sakshi
Sakshi News home page

జయహో జనగామ

Published Tue, Oct 4 2016 1:06 AM

జయహో జనగామ - Sakshi

  •  ఉద్యమ గడ్డపై మిన్నంటిన సంబురాలు
  • జనగామ జిల్లా ఏర్పాటుకు సీఎం అంగీకారం
  • అన్ని వర్గాల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
  • పార్టీల జెండాలతో కార్యకర్తల కోలాహలం
  • జనగామ : జనగామ పోరుగడ్డ తన ఉద్యమ పటిమను మరోమారు చాటుకుంది. పోరాటాలతో దేన్నైనా సాధించుకుంటామని  నిరూపించుకుంది. జిల్లా కోసం ఏడాదిగా చేస్తున్న పోరాటంలో విజయం సాధించింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో జనగామ జిల్లా ఏర్పాటుకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో డివిజన్వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సాయంత్రం 4.30 గంటలకు సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న అధికార, ప్రతిపక్ష నాయకులు  వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపైకి చేరుకొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. అన్ని వర్గాల ప్రజలు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేశారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌.రాజారెడ్డి,  మున్సిపల్‌ వైస్‌ చైర్మన్ నాగారపు వెంకట్, మహిళా కౌన్సిలర్లు వంగాల కళ్యాణి, పన్నీరు రాధిక, వేమళ్ల పద్మతో పాటు అన్ని పార్టీల నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. 
    నెరవేరిన ప్రజల ఆకాంక్ష
    జిల్లాల పునర్విభజనలో జనగామ పేరు ప్రతిపాదించడంతో సంబురాలు చేసుకున్న ప్రజల సంతోషాలు క్షణాల్లో కనుమరుగయ్యాయి. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన సకల జనులు ఉద్యమాలకు నాంది పలికారు. ఏడాది పాటు జాతీయ రహదారిని దిగ్భందిస్తూ, వరంగల్‌–హైదరాబాద్‌కు వెళ్లే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు జనగామ పౌరుషాన్ని చూపించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలసి జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేశారు. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..దైవాన్ని కూడ నమ్ముకున్నారు. జన గర్జన సభతో జనగామ సత్తా చాటిన ప్రజలు.. చివరకు జిల్లాను సాధించుకొని విజయగర్వంతో తలెత్తుకున్నారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి, డాక్టర్‌ లకీ‡్ష్మనారాయణ నాయక్, డాక్టర్‌ రాజమౌళి, బండ యాదగిరిరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, ఆకుల సతీష్, ఆకుల వేణు, ధర్మపురి శ్రీనివాస్, రంగరాజు ప్రవీన్కుమార్, ఉడ్గుల రమేష్, బర్ల శ్రీరాములు,  వైఎస్‌ఆర్‌ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు రొడ్డ కృష్ణ, చిన్నపాగ వెంకటరత్నం, కల్లెపు ప్రవీణ్‌  తదితరులు బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. 
    ప్రజాభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు..
    ప్రజాభీష్టం మేరకే సీఎం కేసీఆర్‌ జనగామ జిల్లాను ఏర్పాటు చేశారని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.  జనగామ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత  కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
    ఎంపీతో కలసి జేఏసీ సంబురాలు
    భువనగరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలసి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, రాజమౌళి, వీరేందర్‌రెడ్డి, ఆకుల సతీష్, మంగళంపల్లి రాజు, బొట్ల శ్రీనివాస్, సౌడ రమేష్‌ వేడుకలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహముద్‌ అలీ, ఎంపీ నర్సయ్యతోపాటు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు జిల్లాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.  

Advertisement
Advertisement