జూన్ 1లోగా ‘స్థానికత’ | Sakshi
Sakshi News home page

జూన్ 1లోగా ‘స్థానికత’

Published Thu, Jan 7 2016 3:16 AM

June 1 deadline 'localism'

♦ కేంద్ర హోం శాఖతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు
♦ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ  ప్రతులను కోరిన కేంద్రం.. పంపిన రాష్ట్రం
 
 సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి తరలివెళ్లే ఉద్యోగులు, ఇతరులు, వారి పిల్లలకు జూన్ 1లోగా స్థానికత వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలను జారీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం కేంద్ర హోం శాఖను సంప్రదించింది. రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోగా ఏపీకి వలస వెళ్లే కుటుంబాలకు  స్థానికతను కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7వ తేదీన కేంద్రాన్ని కోరింది. తుది ముసాయిదా తీర్మానాన్ని సమర్పించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో  ఇంతవరకు ఎటువంటి కదలిక లేదు. దీంతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రాన్ని సంప్రదించింది.

రాష్ట్రపతి ఉత్తర్వులకు 1975, 1976 లో సవరణలు జరిగాయని, ఆ ప్రతులు తమ దగ్గర లేవని తెలియజేస్తూ వాటిని పంపించాల్సిందిగా కేంద్ర హోం శాఖ కోరడంతో.. అప్పటికప్పుడు వాటిని పంపించింది. ఆ సవరణ ప్రతులను పరిశీలించిన తర్వాత ఏమైనా సందేహాలుంటే మళ్లీ సంప్రదింపులు జరుపుతామని కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి తెలియజేసింది.

 లేకపోతే సమస్యే:  ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికి సచివాలయంతో పాటు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు నూతన రాజధానికి తరలి వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్ 1లోగా స్థానికత వర్తించేలాగ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలను జారీ కాకపోతే రాజధానికి తరలివెళ్లే పిల్లల విద్యాభ్యాసానికి సమస్య తలెత్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన తేదీ నుంచి మూడేళ్లలో అంటే 2017 జూన్ 2వ తేదీ కల్లా ఏపీకి వలస వెళ్లే కుటుంబాలందరికీ విద్యా సంస్థల అడ్మిషన్లలో స్థానికత వర్తింప చేసేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని రాష్ట్రం కోరింది.

1974 ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్) ఆర్డర్స్‌లోని పేరా 4 (2) తర్వాత పేరా 4 (3)లో స్థానికత సవరణలను చేర్చాలంది. అలాగే 2017 జూన్ 2వ తేదీలోగా ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు వలస వెళ్లే కుటుంబాలకు ఉద్యోగాల భర్తీలో స్థానికత వర్తింప చేయాలని, ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకురావాలని కూడా కోరింది. 1975 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్స్‌లోని పేరా (7) 2 తర్వాత పేరా 7 (3)లో స్థానికత సవరణలను చేర్చాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ సవరణల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతం నుంచి.. విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వల స వెళ్లినా స్థానికత వర్తించనుంది. ఇప్పటికే ఏపీలో ఉంటున్న వారికి ఏ విధంగా స్థానికత వర్తిస్తుందో వలస వెళ్లిన వారికి కూడా అదే తరహాలో స్థానికత వర్తించనుంది.

Advertisement
Advertisement