యువకుడి ఉసురుతీసిన జేఎల్‌ఎం నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

యువకుడి ఉసురుతీసిన జేఎల్‌ఎం నిర్లక్ష్యం

Published Wed, Sep 7 2016 10:49 AM

యువకుడి ఉసురుతీసిన జేఎల్‌ఎం నిర్లక్ష్యం - Sakshi

పుల్లలచెరువు(ప్రకాశం): విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న జూనియర్‌ లైన్‌మన్‌ (జేఎల్‌ఎం) నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. ఓ కుటుంబానికి చేతికందివచ్చిన కుమారుడిని దూరం చేసింది. పుల్లలచెరువు మండలంలోని సిద్దనపాలెం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల ప్రకారం... సిద్దనపాలెం గ్రామానికి చెందిన వెంకట శ్రీనివాసులు (23) ఐటీఐ చదివి వినుకొండలోని ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. వినాయకచవితి పండుగకు స్వగ్రామానికి వచ్చాడు.

ఇదే గ్రామంలో జేఎల్‌ఎంగా పనిచేస్తున్న నారాయణ అయ్యగానిపల్లి విద్యుత్‌లైన్‌ పనులు చేయాల్సి ఉండగా, అదే సమయంలో గేదెలను తోలుకుని అటుగా వెళ్తున్న వెంకట శ్రీనివాసులుతో ఉన్న పరిచయం మేరకు పిలిచి స్తంభం ఎక్కించాడు. ఆ స్తంభంపై అయ్యగానిపల్లి, మానేపల్లి గ్రామాలకు వెళ్లే రెండు ఫీడర్లు ఉన్నాయి. నారాయణ సూచన మేరకు అయ్యగానిపల్లి ఫీడర్‌ ఎల్‌సీ తీసి విద్యుత్‌ సరఫరాను షిప్ట్‌ ఆపరేటర్‌ నిలిపివేశాడు. కానీ, మానేపల్లి ఫీడర్‌కు విద్యుత్‌ సరఫరా ఉంది.

అయితే, స్తంభం ఎక్కిన శ్రీనివాసులు అయ్యగానిపల్లి ఫీడర్‌కు బదులు మానేపల్లి ఫీడర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై తీగలకు కరుచుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఎదిగిన కొడుకు అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాసులు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాయుడు తెలిపారు. జేఎల్‌ఎం నిర్లక్ష్యంపై మండల విద్యుత్‌ శాఖాధికారి ప్రసన్నకుమార్‌ను వివరణ కోరగా, జేఎల్‌ఎం నారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement