అలా చూసి.. ఇలా వెళ్లారు! | Sakshi
Sakshi News home page

అలా చూసి.. ఇలా వెళ్లారు!

Published Tue, Jan 24 2017 10:17 PM

అలా చూసి.. ఇలా వెళ్లారు! - Sakshi

– ఇది కేంద్ర కరువు బృందం పర్యటన తీరు
– కరువు తీవ్రతను బృందానికి వివరించిన రైతులు
– పంటరుణాలు మాఫీ చేసి ఆదుకోండని వేడుకోలు
 –పరిస్థితి తీవ్రంగా ఉంది.. సమగ్రంగా నివేదిక ఇస్తాం
–కేంద్ర బృందం ప్రతినిధి జేకే రాథోడ్‌ వెల్లడి
 
 
కర్నూలు(అగ్రికల్చర్‌)/ఆలూరు రూరల్‌/ఆదోని/కోడుమూరు:  మంగళవారం ఉదయం 11  గంటల సమయంలో జిల్లాకు వచ్చిన వారు ఐదారు గంటల్లో ఆలూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాలను చుట్టేశారు. పొలాల్లో పండని పంటలను చూసి.. రైతన్నలు గోడు విని..ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వినతుల స్వీకరించారు. సాయంత్రం ఐదు గంటలకు జిల్లా కేంద్రం కర్నూలులోని స్టేట్‌గెస్ట్‌ హౌస్‌లో కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి   కరువుచాలా తీవ్రంగా ఉంది..కేంద్రానికి సమగ్ర నివేదిక ఇస్తామంటూ వెళ్లిపోయారు. ఇది జిల్లాలో కేంద్ర కరువు బ​ృందం పర్యటన తీరు.
 
 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ జేకే రాథోడ్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు జాకర్, రామకృష్ణలు మంగళవారం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించారు. అనంతపురం జిల్లాలో పర్యటనను ముగించుకుని  ఉదయం 11 గంటల సమయంలో ఆలూరుకు చేరుకున్నారు. ముందుగా ఆలూరు మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకును పరిశీలించారు.
 
పలువురు రైతులు మాట్లాడుతూ వేదవతి నదికి మినీ రిజర్వాయర్‌ నిర్మిస్తే దాదాపు 80 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉందని, ఈదిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. హంద్రీనీవా నీటితో  ఆలూరు ట్యాంకును రిజర్వాయర్‌గా మారిస్తే సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని చెప్పారు.  అనంతరం ఆలూరు మండలం ఎ.గోనెహల్‌ గ్రామంలో దెబ్బతిన్న వేరుశనగ, పత్తి, శనగ, ఆముదం తదితర పంట పొలాలను పరిశీలించారు.
 
గతంలో ఎప్పుడూ లేని విధంగా కరువు నెలకొందని పెట్టిన పెట్టుబడులు కూడా దక్కలేదని, అప్పుల్లో కూరుక పోయామని, రైతులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు.  బ్యాంకుల నుంచి తీసుకున్న పంటరుణాలను రద్దు చేయాలని కోరారు. ప్రతి రైతుకు పరిహారం లభించే విధంగా చూడాలని విన్నవించారు. తర్వాత ఆదోని మండలం ధనాపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆదోని ప్రభుత్వ అతిథి గృహంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కేంద్రబృందాన్ని కలిసి జిల్లాను ఆదుకోవాలని నివేదిక సమర్పించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో  దెబ్బతిన్న ఆముదం, పత్తి పంటలను పరిశీలించారు.  కరువు తీవ్రతను కళ్లకు కట్టే విధంగా రైతులు వివరించారు. సాయంత్రం 5గంటలకు కర్నూలు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్న కేంద్ర బృందం ప్రతినిధులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. 
 
జిల్లాకు రూ.373 కోట్లు ఇచ్చి ఆదుకోండి:  జేసీ నివేదిక
జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ కేంద్రబృందానికి నివేదిక సమర్పించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.347.46కోట్లు, నీటి సమస్య పరిష్కారానికి రూ.10.62కోట్లు, పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు రూ.15.38కోట్లు మొత్తంగా రూ.373.46 కోట్లు విడుదల చేయాలని కోరారు.  
 
జిల్లాకు న్యాయం జరిగేలా చూస్తాం
జిల్లాలో కరువు దాని పరిణామాలు తీవ్రంగా ఉన్నాయని.. దీనిపై కేంద్రానికి నివేదిక సమర్పించి జిల్లాకు న్యాయం జరిగే విధంగా చూస్తామని  కేంద్రబృందం ప్రతినిధి రాథోడ్‌ అన్నారు. 
జిల్లాలోని పడమటి ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితులను  పరిశీలించామని,  రైతులతో మాట్లాడామని, వారు కొన్ని సూచనలు ఇచ్చారని వెల్లడించారు. 
 
గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా?
కేంద్ర బృందం ప్రతినిధులు కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకెళ్లి రైతులతో మాట్లాడారు. పంట దిగుబడులు ఏ విధంగా వచ్చాయి. గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా అంటూ రైతులను ప్రశ్నించారు. కేంద్రబృందం మార్కెట్‌కు వెళ్లే సమయానికి చీకటి పడటంతో రైతులు లేరు. ఇద్దరు, ముగ్గురు ఉండగా వారితో ధరల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉల్లి, కంది, వేరుశనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వివరించారు.  కేంద్ర బృందం వెంట జేసీ హరికిరణ్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, సీపీఓ ఆనంద్‌నాయక్, çనీటిపారుదల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, పశుసంవర్థక శాఖ జేడీ సుదర్శన్‌కుమార్, కరూ​‍్నలు ఆర్డీఓ రఘుబాబు, ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఏడీఏ రమణారెడ్డి,  ఏడీఎం సత్యనారాయణచౌదరి తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement