Sakshi News home page

కదిరిలో కల్లోలం

Published Fri, Nov 4 2016 10:23 PM

కదిరిలో కల్లోలం

- ఎమ్మెల్యే చాంద్‌బాషాకు ప్రాధాన్యంపై టీడీపీ కేడర్‌లో అసంతృప్తి
– జనచైతన్య యాత్రలకు కందికుంట వర్గం దూరం
–మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటున్న పార్టీ శ్రేణులు
–మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పంచాయితీ


కదిరి : కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ‘ముందొచ్చిన చెవులు కన్నా వెనుకొచ్చిన కొమ్ములే వాడి’ అన్న చందంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ను కాదని.. ఈ మధ్యే తన స్వార్థం కోసం మళ్లీ టీడీపీలో చేరిన ఎమ్మెల్యే చాంద్‌బాషాకే పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధిష్టానం తీరులో మార్పు రాకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని మండలాల కన్వీనర్లు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రులు కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఎదుట కూడా తేల్చిచెప్పారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

                       టీడీపీ అధిష్టానం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పత్రాలతో పాటు ట్యాబ్‌లతో కూడిన సాంకేతిక పరికరాలను సభ్యత్వ నమోదు ప్రారంభానికి ముందురోజు కందికుంట ఇంటికి పంపింది. తర్వాత ఏం జరిగిందో కానీ ఆ మరుసటి దినమే వాటన్నింటినీ ఎమ్మెల్యే చాంద్‌బాషా ఇంటికి చేర్చమని పార్టీ ఆదేశించింది. దీంతో మొత్తం సామగ్రి చాంద్‌ ఇంటికి తరలించారు. తొలిరోజు మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం కందికుంట ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతానని చెప్పి ఆఖరు నిమిషంలో హ్యాండిచ్చారు. పార్టీ ఎందుకు తనను ఇలా అవమానానికి గురిచేస్తోందంటూ కందికుంట తన అనుచరులు, పార్టీ మండల నాయకుల ఎదుట అసంతృప్తితో రగిలిపోయారు. వెంటనే ఆయన తనకు జరిగిన అవమానాన్ని మంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖామంత్రి కొల్లు రవీంద్రకు అప్పగించింది.

రాజీనామాలకు సిద్ధమన్న పార్టీ శ్రేణులు
మంత్రి కొల్లు రవీంద్ర కందికుంట, చాంద్‌బాషా మధ్య సయోధ్య కుదుర్చేందుకు రంగంలోకి దిగారు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక జిల్లా కేంద్రానికి పిలిపించి అక్కడి మునిసిపల్‌ అతిథి గృహంలో సుమారు రెండు గంటల సేపు పంచాయితీ చేశారు. తొలుత ఇరువర్గాలను కలిపి, ఆ తర్వాత వేర్వేరుగా మాట్లాడారు. 'కందికుంట పార్టీ కోసం 15 ఏళ్లుగా కష్టపడుతున్నారు. కానీ స్వార్థం కోసం పార్టీ మారి, డబ్బుకోసం కక్కుర్తి పడి తిరిగొచ్చిన ఎమ్మెల్యే చాంద్‌బాషాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములే మీకు ఎక్కువైనాయి. అలాంటప్పుడు మేమంతా ఈ పార్టీలో ఎందుకుండాలి? పార్టీకి, మా పదవులకు రాజీనామాలు చేస్తాం' అంటూ నియోజకవర్గంలోని పలువురు టీడీపీ మండల కన్వీనర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మంత్రి కొల్లు ఎదుట ముక్త కంఠంతో చెప్పారు.

ఆ తర్వాత చాంద్‌ వర్గీయులు కూడా తమ వాదన విన్పించారు. 'వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు అక్కడ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించారు. కదిరిలో కూడా అలాగే చేయండ’ని కోరారు. అయితే.. చివరకు కందికుంట వర్గీయులు అలిగి ఆగ్రహంలో బయటకు వచ్చేశారని తెలిసింది. ఈ పరిణామాలను మంత్రులతో పాటు జిల్లా నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆయన తనయుడు లోకేష్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూసి.. ఆ తర్వాత తమ తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని కందికుంట వర్గం చెబుతోంది.

Advertisement

What’s your opinion

Advertisement