కాంటూర్‌ కుదింపు ఎప్పుడు? | Sakshi
Sakshi News home page

కాంటూర్‌ కుదింపు ఎప్పుడు?

Published Sat, Sep 17 2016 12:18 AM

కాంటూర్‌ కుదింపు ఎప్పుడు?

సాక్షి ప్రతినిధి, ఏలూరు :  కొల్లేరు అభయారణ్యం పరిధిని 5 నుంచి 3వ కాంటూర్‌కు కుదిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడాది దాటిపోయినా పట్టించుకోవడం లేదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెరువులను ధ్వంసం చేయడంతో జీవనోపాధి కరువై తామంతా పిల్లలు, వృద్ధులను గ్రామాల్లో వదిలేసి పరాయి రాష్ట్రాలకు వలస వెళ్లామని వాపోయారు. భీమడోలు మండలంలో కొల్లేరు గ్రామమైన ఆగడాల లంకలో శుక్రవారం గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబుకు కొల్లేరు వాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆగడాలలంక ఛానల్‌ రోడ్డు నరకప్రాయంగా మారిందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఇల్లు కట్టిస్తామని మాట తప్పారు
2014లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన ఇల్లు కాలిపోయిందని, ప్రజాప్రతినిధులు వచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి రెండేళ్లయినా పట్టించుకోలేదని మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు పంచాయతీ గ్రామానికి చెందిన మహిళ అవేదన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు డ్వాక్రా రుణమాఫీ అమలు కాలేదని వాపోయారు.
ఒక్క పేదవాడికీ ఇల్లు రాలేదు
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టలేదని పెంటపాడు మండలం పరిమెళ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారి పింఛన్లు రద్దుచేసి టీడీపీ నాయకులు వారి బంధువులకు, అనుచర వర్గానికి ఇచ్చుకున్నారని వాపోయారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైందని తాడేపల్లిగూడెం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. పెంటపాడు మండలం పరిమెళ్ల, యానాలపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం జరిగింది. 
రోడ్లు మరిచారు
తమ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో రహదారులు, డ్రెయినేజీ సమస్యల్ని విస్మరించారని, వర్షం పడితే కాలనీ ముంపునకు గురవుతోందని ఆచంట మండలం భీమలాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, వీరవాసరం ఎంపీపీ కౌరు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భీమలాపురంలో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం జరిగింది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement