అధికారులూ..ఈ మైండ్ గేమ్ ఏంటి? | Sakshi
Sakshi News home page

అధికారులూ..ఈ మైండ్ గేమ్ ఏంటి?

Published Fri, Jul 28 2017 11:29 PM

అధికారులూ..ఈ మైండ్ గేమ్ ఏంటి?

పార్టీల‌కు తొత్తులుగా మారొద్దు
పొంత‌న లేని మాట‌లు మాట్లాడ‌టం సిగ్గు చేటు:కాపు జేఏసీ నేతలు
శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని కాపులకు పిలుపు
కిర్లంపూడి : అధికారులు పొంతనలేని మాటలు మాట్లాడడం సిగ్గు చేటని కాపు జేఏసీ నేతలు అన్నారు. శుక్రవారం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం స్వగృహంలో వారు విలేకర్లతో మాట్లాడారు. బాధ్యతగల పోలీసు వృత్తిలో ఉండి ‘‘ముద్రగడను మేము అరెస్టు చేయలేదు.. ఆయన ఎక్కడికైనా వెళ్లవచ్చు.. రావచ్చు.. అనడం మంచిదికాదన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన పోలీసులు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. కాపులతో పోలీసులు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారన్నారు. రాజకీయ నాయకులు ఆడే మైండ్‌గేమ్‌... పోలీసులు ఆడి రాజకీయాలు చేస్తూ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఖాకీ బట్టలు వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు, మంత్రులు అచ్చన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజ్ప, మంత్రి నారాయణలు ముద్రగడ పాదయాత్ర సక్రమం కాదు... అనైతికమంటూ రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని, నిర్ణీత కాలపరిధిలో కాపు, తెలగ, ఒంటరి బలిజ కులాలను బీసీల్లో చేరుస్తామని చెప్పింది మీ ముఖ్యమంత్రి కాదా? ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పింది మీ ముఖ్యమంత్రి కాదా? ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పిస్తామని చెప్పింది మీ ముఖ్యమంత్రికాదా? అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాలైన రెవెన్యూ, పోలీసులు, ప్రజాప్రతినిధులు ఇస్తున్న ప్రకటనలకు ఒకదానికొకటి పొంతనలేకుండా ఉందన్నారు.  తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను గుర్తిచేయడం కోసమే నిరవధిక పాదయాత్ర చేపట్టారని, దానికి ప్రభుత్వం ఆటంకం కల్పించినందుకు నిరసనగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విలేకర్ల సమావేశంలో కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, గౌతు స్వామి, తుమ్మలపల్లి రమేష్, చల్లా సత్యనారాయణ, కాలపురెడ్డి వీర్రాజు, ఎస్‌కే ఇబ్రహీం, మండపాక చలపతి, బీసీ నాయకులు రాపేటి పెద్ద, టి.అప్పలరాజు తదితరులు ఉన్నారు.  

Advertisement
Advertisement