కాపులను బీసీల్లో చేరిస్తే గుణపాఠం చెబుతాం | Sakshi
Sakshi News home page

కాపులను బీసీల్లో చేరిస్తే గుణపాఠం చెబుతాం

Published Tue, Aug 16 2016 10:11 PM

కాపులను బీసీల్లో చేరిస్తే గుణపాఠం చెబుతాం

బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్‌ హెచ్చరిక
ఒంగోలు టౌన్‌: కాపులను బీసీలో చేరిస్తే అధికార తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జి.గంగాధర్‌ హెచ్చరించారు. కాపులను బీసీలో చేర్చేందుకు మద్దతు ఇస్తున్న పార్టీలకు కూడా భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. కాపులను బీసీలో చేర్చే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులే జీవనాధారం చేసుకొని జీవిస్తున్న బీసీలకు అండగా ఉంటున్న రిజర్వేషన్లకు గండికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని ధ్వజమెత్తారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీలో చేర్చాలనుకోవడం రాజ్యాంగ ఉల్లఘన అవుతోందన్నారు. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర నాయకుడు ఎరుగుల కోటేశ్వరరావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, బీసీ సంఘాల నాయకులు ధన్నారపు మస్తాన్‌రావు, కఠారి శంకర్, తన్నీరు నాగేశ్వరరావు, ధరణికోట లక్ష్మీనారాయణ, బొట్ల రామారావు, షేక్‌ అజీజ్, పెనిగండ్ల వెంకటేశ్వర్లు, గొల్లపోతు ఏడుకొండలు, ఊటుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహాధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ నరసింగరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. 
 

Advertisement
Advertisement