3 మండలాలు | Sakshi
Sakshi News home page

3 మండలాలు

Published Mon, Aug 22 2016 11:52 PM

Karimnagar diveded 3mandals

  • కరీంనగర్‌ అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాలుగా విభజన
  • కరీంనగర్‌ అర్బన్‌ జనాభా 2,61,185
  • కరీంనగర్‌ రూరల్‌ జనాభా 50,711
  • కొత్తపల్లి జనాభా 51,210
  • ఫలించిన ఎమ్మెల్యే గంగుల ప్రయత్నం
  • కరీంనగర్‌ రూరల్‌ : కరీంనగర్‌ను మూడు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2011 జనాభా ప్రాతిపదికన కరీంనగర్‌ నియోజకవర్గాన్ని మూడు మండలాలుగా ప్రభుత్వం విభజించింది. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను అర్బన్‌ మండలంగా, కరీంనగర్‌ మండలాన్ని కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాలుగా విభజిస్తున్న పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాలు, మండలాల పునర్విభజనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ సోమవారం విడుదల చేసింది.   
     
    ఫలించిన ఎమ్మెల్యే ప్రయత్నం
    కరీంనగర్‌ నియోజవర్గం మున్సిపల్‌ కార్పొరేషన్, మండలంతో కలిపి జనాభాప్రాతిపదికన పెద్దగా ఉండడంతోపాటు ఒకే రెవెన్యూ కార్యాలయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అర్బన్‌ రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా  ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కరీంనగర్‌లో ఒక అర్బన్, రెండు రూరల్‌ రెవెన్యూ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ స్వయంగా అర్బన్‌ రెవెన్యూ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా మోక్షం లభించలేదు. చివరికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో కరీంనగర్‌ నియోజకవర్గాన్ని మూడు మండలాలుగా విభజించాలని ఎమ్మెల్యే సూచనలతో రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదించింది.
     
    మూడు మండలాలుగా విభజన
    రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం కరీంనగర్‌ నియోజకవర్గాన్ని మూడు మండలాలుగా విభజించారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లు, ఎల్‌ఎండీ నిర్మాణంతో ముంపునకు గురైన పోతుగల్, హస్నాపూర్‌తో కరీంనగర్‌ అర్బన్‌ మండలంగా ఏర్పాటు చేశారు. అర్బన్‌ మండల జనాభా 2,61,185. కొత్తపల్లి మండల కేంద్రంగా నాగులమల్యాల, ఖాజీపూర్, ఆసిఫ్‌నగర్, ఎలగందల్, బద్దిపల్లి, కమాన్‌పూర్, మల్కాపూర్, కొత్తపల్లి, లక్ష్మీపూర్, చింతకుంట, రేకుర్తి, సీతారాంపూర్, పద్మనగర్‌ గ్రామాలు ఉన్నాయి. కొత్తపల్లి మండల జనాభా 51,210గా పేర్కొన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో నగునూరు, జూబ్లినగర్, ఫకీర్‌పేట, చామన్‌పల్లి, తాహెర్‌కొండాపూర్, చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్, ఇరుకుల్ల, ఎలబోతారం, వల్లంపహాడ్, దుర్శేడ్, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి రెవెన్యూ గ్రామాలతోపాటు మందులపల్లి, బహదూర్‌ఖాన్‌పేట, తీగలగుంటపల్లి, నల్లగుంటపల్లి, గోపాల్‌పూర్‌ గ్రామపంచాయతీలను చేర్చారు.  
     

Advertisement
Advertisement