'సొంత నిర్ణయాల వల్లే డిప్యూటీ సీఎంను తొలగించారు' | Sakshi
Sakshi News home page

'సొంత నిర్ణయాల వల్లే డిప్యూటీ సీఎంను తొలగించారు'

Published Sat, Jun 25 2016 10:13 PM

kcr handle ministers with remote control, says CITU secretary saibaba

  • సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ
  • హన్మకొండ : సీఎం కేసీఆర్ మంత్రులను రిమోట్ ద్వారా నడిపిస్తున్నారని, మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునెటైడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో రెండో ఏఎన్‌ఎంలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారిని ఆయన శనివారం కలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి వైద్య, ఆరోగ్యశాఖమంత్రిగా, విద్యావేత్త కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా, పంచె కట్టిన వ్యవసాయదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నా, వీరు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

    సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ఎక్కడ తమను తొలగిస్తారనే భయం మంత్రులలో నెలకొందన్నారు. అందుకే ఎలాంటి నిర్ణయాల జోలికి వెళ్లకపోవడమే మంచి అనే ఆలోచనతో పాటు సీఎం కేసీఆర్‌కు భజన చేస్తే చాలు అన్నట్లుగా రాష్ట్ర మంత్రులున్నారని విమర్శించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా డాక్టర్ ఉన్నా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు, ధర్నాలు నిత్యకృత్యమయ్యాయని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. గుడ్డి ప్రభుత్వం మేల్గొనేలా పోరాటాలు చేస్తామని సాయిబాబ పేర్కొన్నారు.

Advertisement
Advertisement