కేజీ టు పీజీ .. గజిబిజి | Sakshi
Sakshi News home page

కేజీ టు పీజీ .. గజిబిజి

Published Mon, Oct 26 2015 2:41 AM

కేజీ టు పీజీ .. గజిబిజి

* ఏడాదిన్నరగా ప్రకటనలే తప్ప చర్యలు చేపట్టని సర్కారు
* నియోజకవర్గానికి 10 చొప్పున 1,190 స్కూళ్ల ఏర్పాటు లక్ష్యం
* 2016 జూన్ నుంచి ప్రారంభిస్తామన్నా.. కనీస కార్యాచరణకూ దిక్కులేదు... మిగిలిన సమయం ఇంకా ఎనిమిది నెలలే
* ఇప్పుడున్న గురుకులాలు 668.. మోడల్ స్కూళ్లు మరో 187
* మిగతా వాటికి స్థలాలేవీ, ఎక్కడ నిర్మిస్తారు?
* గురుకులాలను ఒకే గొడుగు కిందకు తేవడంపైనా అస్పష్టత
* బాలికలకే పరిమితమైన కేజీబీవీల్లో బాలురకూ అవకాశమిస్తారా?
* విద్యార్థులకు వసతి గృహాల పరిస్థితి ఏమిటి?
* గందరగోళంగా మారిన ‘కేజీ టు పీజీ’ పథకం  
 
 ‘వచ్చే ఏడాది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తాం. ఈ బృహత్తర పథకం ఉపాధ్యాయుల చేతుల్లో పెరిగే పాప కావాలి..’
 - 2014 సెప్టెంబర్ 4న ఉపాధ్యాయ
 దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్ష
 
 ‘గురుకులాలను కేజీ టు పీజీలో భాగం చేస్తాం. నియోజకవర్గానికి 10 చొప్పున స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 662 ఉన్నాయి. మరో 528 ప్రారంభిస్తాం..’
 - ఆగస్టు 5న ‘కేజీ టు పీజీ’పై డిప్యూటీ సీఎం
 కడియం శ్రీహరి చెప్పిన అంశం
 
‘మూడు దశల్లో కేజీ టు పీజీ.. 12వ తరగతి వరకు స్కూళ్లలో తరగతులు. తదనంతరం గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)లను అనుసంధానం చేయడం. కేజీ నుంచి 4వ తరగతి వరకు సాధారణ విద్య. 5వ తరగతి నుంచి నివాస వసతితో కూడిన గురుకుల విద్య అందించడమే లక్ష్యం..’
 - గత ఏడాది జూలై 1న సీఎస్
 అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయం  

 
 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కేజీ టు పీజీ’ విద్య గందరగోళంగా మారింది. ప్రాథమిక పాఠశాలల నుంచి పీజీ దాకా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తామన్న హామీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఈ పథకంపై ప్రభుత్వం ఒక్కో సమయంలో ఒక్కో రకమైన ఆలోచనలు చేస్తోంది. ఒక్కో రకమైన ప్రకటనలు చేస్తోంది. కానీ ఇంతవరకూ కనీస కార్యాచరణకు మాత్రం దిక్కులేదు. ‘ప్రతిష్టాత్మక పథకం కనుక ఆలస్యమైనా ఫరవాలేదు.. పకడ్బందీగా ప్రారంభించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష..’’ అని మంత్రులు, సీఎం పలు సందర్భాల్లో చె బుతూ వస్తున్నారు. చివరికి 2016 జూన్‌లో ‘కేజీ టు పీజీ’ని ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి మరో ఎనిమిది నెలలు మాత్రమే గడువున్నా... చర్యలు మాత్రం కానరావడం లేదు.               
- సాక్షి, హైదరాబాద్
 
పరిపాలన సౌలభ్యం కోసమంటూ..

 ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటితోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలను చేర్చాలని భావిస్తోంది. కానీ కేజీ టు పీజీలో భాగంగా వీటిని ఒకే పరిధిలోకి తెస్తున్నారా, పాలనపరమైన సౌలభ్యం కోసమే చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఆయా స్కూళ్ల సమస్యలపైనా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గందరగోళంగా మారింది. వచ్చే విద్యా విద్యాసంవత్సరంలోనైనా ‘కేజీ టు పీజీ’ని ప్రారంభిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
ఇప్పటికీ స్పష్టత కరువే
 ‘కేజీ టు పీజీ’ అమలుపై ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహనకు ప్రభుత్వవర్గాలే రాలేకపోతున్నాయి. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించే బృహత్తర లక్ష్యమైన ఈ పథకంపై సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన చేస్తున్నారే తప్ప ఏదీ ఆచరణకు నోచుకోవడం లేదు. కేజీ టు పీజీని వచ్చే విద్యా సంవత్సరం (2016 జూన్)లో ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇందుకు ఇంకా 8 నెలల సమయమే ఉన్నా ఇప్పటికీ కనీస కార్యాచరణ ప్రారంభం కాలేదు. చివరకు రాష్ట్రంలోని గురుకులాలు, కేజీబీవీలు (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు), మోడల్ స్కూల్‌లు అన్నింటిని ఈ పథకంలో భాగం చేసినా ప్రభుత్వ లక్ష్యం ప్రకారం మరో 351 స్కూళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 391 కేజీబీవీలు, 44 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 132 గిరిజన సంక్షేమ గురుకులాలు, 95 ప్రభుత్వ గురుకులాలు కలిపి మొత్తంగా 662 స్కూళ్లు ఉన్నాయి.
 
 ప్రభుత్వం కేజీ టు పీజీ కింద లక్ష్యంగా పెట్టుకున్న స్కూళ్లు 1,190.. అంటే మరో 528 స్కూళ్లు అవసరం. అయితే కేంద్రం మోడల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసినందున రాష్ట్రంలో ఉన్న 187 మోడల్ స్కూళ్లను కూడా వీటితో కలపాలని భావిస్తున్నారు. వీటిని కలిపినా మొత్తంగా 839 స్కూళ్లు మాత్రమే కేజీ టు పీజీకి అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మరో 351 స్కూళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కనీసం ఆ స్కూళ్లకోసం స్థలాల సేకరణ కూడా చేపట్టలేదు. మరి స్థలాలు సేకరించేదెప్పుడు, స్కూళ్ల నిర్మాణం, మౌలిక సౌకర్యాలు కల్పించేదెప్పుడు, తరగతులు ప్రారంభించేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బాలికలకే పరిమితమైన 391 కేజీబీవీల్లో బాలురకు కూడా ప్రవేశాలు కల్పిస్తారా, అలాగే కొనసాగిస్తారా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇక 12వ తరగతి వరకు ఉన్న 100 మోడల్ స్కూళ్లకు సంబంధించి వాటి ఆవరణలో బాలికలకు హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. మరి వాటిలో బాలురకు హాస్టల్ సదుపాయం కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Advertisement
Advertisement