కిడ్నాపైన బాలుడు రేవంత్‌ క్షేమం | Sakshi
Sakshi News home page

కిడ్నాపైన బాలుడు రేవంత్‌ క్షేమం

Published Sat, May 7 2016 9:50 PM

Kidnapped revanth sai kumar found in gutur

గుంటూరు: మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురైన సంఘటన గుంటూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసులు కిడ్నాప్ వ్యవహారాన్ని గంటల వ్యధిలో ఛేదించి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని క్షేమంగా కిడ్నాపర్ చెర నుంచి రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట చిన్న బజారులో నివసించే గుడివాడ శివనాగేశ్వరావు ఊరావారి వీధిలో శ్రీ సుబ్బలక్ష్మి టెక్స్‌టైల్స్‌తోపాటు దానికి సమీపంలోనే భవాని కిడ్స్‌వేర్ పేరుతో రెండు వస్త్రాల షాపులు నిర్వహిస్తున్నాడు. శివనాగేశ్వరరావు, సరోజిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకువివాహం చేశాడు. కుమారుడు ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. దీనితో కొడుకు కావాలనే ఆశతో సుభాషిణిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు పిల్లలు కలుగలేదు. దీనితో మూడేళ్ల క్రితం ఓ ఆసుపత్రిలో జన్మించిన రోజుల బాలుడిని దత్తత తీసుకుని రేవంత్‌సాయికుమార్ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు.

శనివారం మధ్యాహ్నాం 1.15 గంటల సమయంలో రేవంత్ సాయికుమార్ భవాని కిడ్స్‌వేర్ షాపు ముందు ఉన్న కౌంటర్ మీద కూర్చుని ఉన్నాడు. శివనాగేశ్వరావు మొదటి భార్య సరోజిని షాపులో ఉంది. ఈ సమయంలో ఎర్ర టీషర్ట్ వేసుకున్న ఓ యువకుడు దుకాణంలోకి వచ్చి దుస్తులు బేరమాడుతున్నట్టుగా నటించి రేవంత్ సాయికుమార్‌ను బలవంతంగా ఎత్తుకుని తన ద్విచక్రవాహనం ముందు కూర్చొపెట్టుకుని పరారయ్యాడు. గమనించిన స్థానికులు కేకలు వేస్తూ పట్టుకునేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది.

ఓ వ్యాపారి ద్విచక్రవాహనాన్ని అడ్డుకోబోగా కొట్టి వెళ్లిపోయాడు. బాలుడ్ని ఎత్తుకెళ్లేందుకు పది నిమిషాలకు ముందు కిడ్నాపర్ దుకాణం ముందు ఓ హిజ్రాతో వేరే భాషలో మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ అడిషనల్ ఎస్పీ జె. భాస్కరరావు, ఈస్ట్, వెస్ట్ డీఎస్పీలు సంతోష్, సరిత, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కిడ్నాప్‌నకు గురయిన దుకాణానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజిలో బాలుడిన బైక్‌పై ఎత్తుకెళ్తున్న దుండగుడు స్పష్టంగా కనిపించడంతోపాటు బైక్ నంబర్‌ను పోలీసులు గుర్తించారు.

దీంతో అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో డీఎస్పీల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజిలతోపాటు సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్‌ను పట్టుకుని బాలుడ్ని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాప్‌కు కుటుంబ కలహాలు కారణం కాదని విచారణ తరువాత అసలు విషయాలు తేలుతాయని చెప్పారు. అయితే బాలుడ్ని దుకాణం వద్ద వదిలేసేందుకు ఓ వ్యక్తి రాగా పోలీసులు పట్టుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు మాత్రం పూర్తి విషయాలు బయటపెట్టేందుకు విముఖత వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement