'ఓట్లు వేయకుంటే కళ్లు పోతాయా?' | Sakshi
Sakshi News home page

'ఓట్లు వేయకుంటే కళ్లు పోతాయా?'

Published Sun, Nov 15 2015 8:50 PM

'ఓట్లు వేయకుంటే కళ్లు పోతాయా?' - Sakshi

హన్మకొండ(వరంగల్ జిల్లా): వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయకపోతే కళ్లు పోతాయని కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అగర్వాల్‌తో కలిసి హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. శాపనార్థాలకు ఓటర్లు భయపడరని, ఓట్లు పడవని చెప్పారు. టీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేస్తే రాష్ట్ర మంత్రులంతా వరంగల్‌లోనే ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.

సంక్షేమ పథకాలు, హామీలు అమలు చేయకుండా కళ్లు పోతాయనడం మూర్ఖత్వం, దుర్మార్గమని మండిపడ్డారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను బెదిరిస్తున్నారని, ఆ సంఘాలను తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. చివరి వరకు పత్తి కొనుగోలు చేస్తే రాజీనామా చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అంటున్నారని.. ఆయనకు పత్తి కోనుగొలు అధికారం లేనప్పుడు రాజీనామా చేయడమెందుకని ప్రశ్నించారు.

పత్తి కొనుగోలుకు నయా పైసా ఖర్చు చేయకుండా ఆర్థిక మంత్రిని బలి చేయడం బాగుండదని, అధికారమంతా కేసీఆర్ వద్దే కేంద్రీకృతమై ఉందని అన్నారు. మహారాష్ట్రలో లాగా సీసీఐకి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, చేతగాకపోతే తామే చేస్తామని అన్నారు. పత్తి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement